
అనుమానమొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఆపేసిన జపాన్ అధికారులు
వెలుగులోకి మానవ అక్రమ రవాణా కేసు
లాహోర్: చిట్టడవులు, కొండ ప్రాంతాలు, సరిహద్దు గుండా ఉగ్రవాదులను పాకిస్తాన్ అక్రమంగా భారత్‌లోకి పంపిస్తుంటే.. ఇదే స్ఫూర్తితో ఒక పాకిస్తానీయుడు తోటి పాకిస్తానీయులను మోసం చేసి జపాన్‌కు పంపించాడు. ‘గోల్డెన్ ఫుట్‌బాల్ ట్రయల్’ పేరిట ఫుట్‌బాల్ క్లబ్ బృంద సభ్యులుగా జపాన్‌లోకి అడుగుపెట్టిన ఈ నకిలీ ఆటగాళ్లను జపాన్ అధికారులు ఎయిర్‌పోర్ట్‌లోనే అనుమానంతో ఆపేశారు.
అట్నుంచి అటే మళ్లీ పాకిస్తాన్‌కు తిరుగుటపా చేశారు. 15 రోజుల తాత్కాలిక పాక్ వీసాతో జపాన్‌కు వచి్చన 22 మందిని వెనువెంటనే తిరిగి పంపించిన ఘటన జూన్‌లో జరగ్గా చాలా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఫుట్‌బాల్ టీమ్ అంశాన్ని పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ.. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీరియస్‌గా తీసుకుంది. 22 మందిని జపాన్‌కు పంపిన మానవ అక్రమ రవాణా కేసులో మాలిక్ వకాస్‌ను ఎఫ్‌ఐఏ అధికారులు అరెస్ట్‌చేశారు.
ఫుట్‌బాల్ ఆటగాళ్లలాగే
ఫుట్‌బాల్ ఆటగాళ్లమాదిరే నిజమైన టీమ్ జెర్సీ దుస్తుల్లో జపాన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే తర్వాత వీళ్ల ధోరణి చూసి జపాన్ ఇమిగ్రేషన్ అధికారులకు అనుమానమొచ్చి వీళ్లను లోతుగా ప్రశ్నించి అసలు విషయంరాబట్టారు. పాక్ ఎయిర్‌పోర్ట్ అధికారుల కళ్లుగప్పి ఇక్కడిదాకా ఎలా రాగలిగారనే ప్రశ్న జపాన్ అధికారులను తొలచేస్తోంది. పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధికారులతో మాలిక్ వక్రాస్‌కు సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జపాన్‌కు పంపేందుకు ఈ ఒక్కో అక్రమ వలసదారుడి నుంచి కనీసం 45 లక్షల పాక్ రూపాయలను వసూలుచేసినట్లు తెలుస్తోంది. మాలిక్ జపాన్‌కు ఇలా గతంలోనూ కొందరిని తరలించాడని సమాచారం. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 17 మందిని జపాన్‌కు తరలించాడు. ఈ విషయంలో గత ఏడాది జనవరిలో వెలుగులోకి వచి్చంది. అప్పుడు వెళ్లిన వాళ్లెవరూ తిరిగి పాక్‌కు రాలేదు.