అవమానించారంటూ ఆయువు తీసుకుంది  | Sakshi
Sakshi News home page

అవమానించారంటూ ఆయువు తీసుకుంది 

Published Sat, Aug 27 2022 12:39 AM

8th Class Student Committed Suicide In Hayatnagar - Sakshi

హయత్‌నగర్‌: పాఠశాలలో అవమానం జరిగిందని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హయత్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకుంది.  విద్యార్థిని మృతికి ఉపాధ్యాయుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

మృతురాలి బంధువులు,  పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌ డివిజన్‌లోని బంజారా కాలనీలో నివసించే కరంటోతు లక్పతి, సరిత దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. లక్పతి ఆటో డ్రైవర్‌. ఆయన కూతురు అక్షయ శాశ్వత్‌ (13) హయత్‌నగర్‌ రాఘవేంద్ర కాలనీలోని శాంతినికేతన్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్‌ ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.

గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన అక్షయ తలుపులు వేసుకుని చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఊరికి వెళ్లిన తల్లి దండ్రులు ఇంటికి ఫోన్‌ చేయగా ఎంతకూ ఎత్తలేదు. దీంతో పక్క వీధిలో నివసించే వారి బంధువులకు ఫోన్‌ చేయగా వారు వచ్చి తలుపులు తీసి చూశారు. అక్షయ ఉరేసుకుని కనిపించింది. కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీందో వారు తల్లిదండ్రులకు సమాచారం 
అందించారు. 

పాఠశాలపై దాడికి యత్నం.. 
శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు అక్షయ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కూతు మృతికి పాఠశాల ఉపాధ్యాయులే కారణమంటూ ఆరోపించారు. విద్యార్థినిని అవమానించిన ఉపాధ్యాయులను, పాఠశాల యాజమాన్యాన్ని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ పురుషోత్తంరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  న్యాయం చేస్తామని పోలీసులు, పాఠశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

బయట నిలబెట్టారు: తోటి విద్యార్థిని 
తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు బెంచీలు మారడంతో తమకు తెలియకుండా ఎందుకు మారారని ఓ ఉపాధ్యాయుడు అక్షయతో పాటు మరో విద్యార్థినిని బయట నిల్చోబెట్టారని తోటి విద్యార్థిని తెలిపింది. తర్వాత మరో టీచర్‌ వచ్చి మీరెందుకు బయట ఉన్నారు... లోపలికి రమ్మని పిలిచింది. మిమ్మల్ని బయట నిలబెట్టాను కదా లోపలికి ఎందుకు వచ్చారని సదరు ఉపాధ్యాయుడు అడిగాడని ఆమె తెలిపింది.

టీచర్‌ రమ్మని చెప్పినట్లు వారు సమాధానమిచ్చారు. తాను రమ్మనలేదు టీచర్‌ అనడంతో తిరిగి వారిని బయట నిలబెట్టారు. సుమారు రెండు పీరియడ్లు బయట నిలుచోవడంతో వారు తమకు అవమానం జరిగినట్లు భావించారని. దీంతో అక్షయ మనస్తాపానికి గురై ఉండవచ్చని తోటి విద్యార్థిని తెలిపింది.  

అవసరమైతే పాఠశాలపై కేసు నమోదు చేస్తాం: సీఐ 
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని హయత్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. విద్యార్థిని మృతికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు కారణమని తేలితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. 

Advertisement
Advertisement