వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం

8 people were deceased in different road accidents - Sakshi

కృష్ణా, అనంతపురం జిల్లాల్లో విషాద ఘటనలు

కేసరపల్లి (గన్నవరం)/సోమందేపల్లి/అనంతపురం విద్య/రాప్తాడు: రాష్ట్రంలో బుధవారం 3 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం చెందారు. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలతోపాటు రెండేళ్ల కుమారుడు మృత్యువాత పడగా, అనంతపురం జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో మరో ఐదుగురు మృతిచెందారు. గుంటూరు జిల్లా మాచాయపాలేనికి చెందిన కొమిటి శ్రీనివాసరావు (24) నాలుగేళ్ల క్రితం కూలీ పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం కొరిపేటకు వెళ్లాడు. అక్కడే రాజ్యలక్ష్మి (26)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని ఓ హాస్టల్‌లో వాచ్‌మెన్‌గా పని దొరకడంతో మంగళవారం రాత్రి భార్య, రెండేళ్ల కుమారుడితో కలిసి నూకల లోడుతో వెళ్తున్న లారీలో ఎక్కారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో లారీ గన్నవరం మండలం కేసరపల్లి వద్ద బోల్తా పడింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగినప్పుడు లారీని క్లీనర్‌ నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 

చికిత్స కోసం వెళ్తుండగా.. 
అనంతపురం సూర్యనగర్‌కు చెందిన షాకూన్‌ బీ (63)కి ఆరోగ్యం బాగో లేకపోవడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం ఎర్టిగా కారులో కుమారుడు జాఫర్‌ (50), మరో ముగ్గురు కుటుంబ సభ్యులతో బయల్దేరారు. పాపిరెడ్డిపల్లి వద్దకు రాగానే అనంతపురం వైపు అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి రెండు పల్టీలు కొడుతూ వచ్చి ఎర్టిగాను ఢీకొంది. ఎర్టిగాలోని జాఫర్, మహబూబ్‌ (45) అక్కడికక్కడే మృతిచెందారు. షాకూన్‌ బీ పెనుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. 

18 రోజుల కిందటే పెళ్లి.. ఇంతలోనే ఘోరం 
వారికి పెళ్లయ్యి 18 రోజులే అయింది. అంతలోనే నవ దంపతులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.  శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ (డీఓఏ) కార్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ నాయుడు కుమారుడు విష్ణువర్ధన్‌ (30), కోడలు కిల్వా కీర్తి (28) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.  విష్ణువర్ధన్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భార్య కీర్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి గత నెల 19న వివాహం జరిగింది. నవ దంపతులు రెండు రోజుల క్రితం బెంగళూరులో ఉన్న సుధాకర్‌ నాయుడు కుమార్తె వద్దకు వెళ్లారు. బుధవారం కారులో తిరిగి వస్తుండగా లింగనపల్లి క్రాస్‌ వద్ద బొమ్మేపర్తి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి  బైక్‌పై  వెళుతూ అడ్డొచ్చాడు. అతన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, ఆ వెంటనే కంటైనర్‌ లారీని ఢీకొని మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన నవ దంపతులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top