నారాయణవనం: సాంకేతికతను అందిపుచ్చుకుని, కృత్రిమ మేధస్సుతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడంలో యువ ఇంజినీర్లు శ్రద్ధ చూపాలని తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో విజయవంత్ మాథుర్ సూచించారు. సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ‘వ్యవసాయం, ఆహార వ్యవస్థల్లో కృత్రిమ మేధస్సు ప్రాథమిక అంశాలు, అనువర్తనాలు, భవిష్యత్ అవకాశాలు’ అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ శనివారం ముగిసింది. స్మార్ట్ ఫార్మింగ్, డిజిటల్ వ్యవసాయం, జనరేటివ్ ఏఐ, మొక్కల వ్యాధుల గుర్తింపులో డీప్ లెర్నింగ్, డ్రోన్లు–రోబోటిక్స్, పంట దిగుబడి అంచనా, వాతావరణ అనుకూల సాగు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆహార నాణ్యత అంచనా, భద్రత, ఏఐ ఆధారిత తనిఖీ పద్ధతులు, నేల–నీటి వనరుల నిర్వహణపై సెషన్లు నిర్వహించారు. శనివారం జరిగిన సెమీనార్‌లో ముఖ్యఅతిథి విజయవంత్ మాధుర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌ల సమన్వయంతో వ్యవసాయరంగంలో సాంకేతిక పరిష్కారాలను అందుబాటులోకి తీసురావాలని సూచించారు.. ప్రాంతీయ భాషలో సాంకేతిక విద్యను మరింత చేరువ చేయడ, వ్యవసాయ–ఆహార రంగాల్లో ఏఐ ఆధారిత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై కళాశాలలు శ్రద్ధ చూపాల ని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాళ్లు రమేష్‌కుమార్, జనార్ధనరాజు, వైస్ ప్రిన్సిపల్ మధు, ప్రోగ్రాం కన్వీనర్ మల్లిక, కో–ఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు.


