నవ్యావిష్కరణల వేదిక
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : సైకాలజీ రంగంలో ఆవిష్కరణల దిశగా అపోలో యూనివర్సిటీ మరో అడుగు ముందేసింది. చిత్తూరు నగరం మురకంబట్టులోని అపోలో విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగం, ఇననిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఇన్నోవేషన్ షోకేస్–2026’ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. అధ్యాపకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె. భాస్కర్ రెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాట్లాడుతూ.. సైకాలజీలో ఆవిష్కరణల ప్రాధాన్యం వివరించారు. పుస్తకాల పరిమితిలోనే కాకుండా, సమాజ అవసరాలకు అనుగుణంగా సిద్ధాంత జ్ఞానాన్ని ఆచరణాత్మక పరిష్కారాలుగా మలచాలని విద్యార్థులను ప్రోత్సహించారు. డా. ఏ.బి. మంజు, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మాట్లాడుతూ.. అంతరశాఖ ఆవిష్కరణల అవసరాన్ని వివరించారు. ఆధునిక ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో సాంకేతిక ఆధారిత సైకాలజీ పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు మోడల్స్, పోస్టర్లు, భావనాత్మక ప్రదర్శనల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు. సమకాలీన మానసిక ఆరోగ్య సమస్యలు, యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలకు పరిష్కారాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమాన్ని డా. పి. సుధ, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకాలజీ విభాగం , ఐఐసీ సభ్యురాలు సమన్వయం చేశారు. సైకాలజీ రంగంలో ఆవిష్కరణలు అందుబాటులో ఉండే మానసిక ఆరోగ్య సేవలకు దోహదపడతాయని పేర్కొన్నారు.


