తోతాపోరు | - | Sakshi
Sakshi News home page

తోతాపోరు

Mar 1 2026 7:51 AM | Updated on Mar 1 2026 7:51 AM

తోతాప

తోతాపోరు

జిల్లాలో మామిడి రైతుల దుస్థితి గతేడాది బిల్లుల పెండింగ్‌ కేజీకి రూ.4 చెల్లిస్తామని షాక్‌ రూ.8 ఇవ్వాలని రైతుల డిమాండ్‌ చెర్లోపల్లి ఫ్యాక్టరీ ఎదుట ధర్నా

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : జిల్లాలో మామిడి (తోతాపురి రకం) రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సుమారు 56 వేల హెక్టార్లలో సాగవుతున్న మామిడి పంట ఈసారి రైతులకు కన్నీళ్లు మిగిల్చేలా ఉంది. గతేడాది ఫ్యాక్టరీలకు తోలిన కాయలకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలలు గడుస్తున్నా ఫ్యాక్టరీల నుంచి స్పందన లేకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాలకుల తీరుపై మండిపడుతూ శనివారం చిత్తూరు మండలం చెర్లోపల్లి వద్ద ఉన్న ఫ్యాక్టరీ వద్ద రైతులు గొడవకు దిగారు. ధర్నా నిర్వహించారు.

జిల్లాలో 56 వేల హెక్టార్లల్లో మామిడి సాగు ఉంది. గతేడాది 31 ఫ్యాక్టరీలు 49350 మంది రైతుల నుంచి 2.31 లక్షల మెట్రిక్‌ టన్నుల కాయలను కొనుగోలు చేసింది. ర్యాంపులు 30,600 మంది రైతుల నుంచి 1.44 లక్షల టన్నుల కాయలను కొనుగోలు చేశాయి. నెలల తరబడి కాయల కొనుగోలు జరగగా....చెల్లింపులు మాత్రం పది నెలలు గడుస్తున్నా రైతులు తోలిన కాయలకు ప్రతిఫలం..చేతికి రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు.

పాలకులు పట్టించుకోరా?

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఏ పంట పండించిన గిట్టుబాటు ధర చేతికి రావడం లేదు. ప్రధానంగా మామిడి కేజీకి రూ.4 మాత్రమే ఇస్తున్నారు. టమాట ధర ఢమాల్‌ అయింది. కేజీ ధర రూ. 5 నుంచి రూ.10 మాత్రమే పలుకుతోంది. బంతి పూలు రోడ్డుపాలవుతున్నాయి. చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ప్రధానంగా మామిడి రైతులను ఉద్దేశించి పలువురు ప్రజాప్రతినిధులు ప్రాసెసింగ్‌ యూనిట్‌ తీసుకొస్తామని సభలో గొప్పలు చెప్పారు. మ్యాంగో బోర్డు తీసుకొస్తామని హామీలు గుప్పించారు. తీరా అవేవీ కనిపించడంలేదు.

ఆగ్రహానికి అడ్డుకట్ట వేయాలని..

ప్రభుత్వం మామిడి సీజన్‌ సమయంలో వారి ఆగ్రహానికి అడ్డుకట్ట వేయాలని గిట్టుబాటు ధరను తీసుకొచ్చింది. ఫ్యాక్టరీలు కేజీకి రూ. 8 ఇవ్వాలని ఆదేశించింది. అయితే చివరకు ఆ హామీ ఉత్తుత్తిదే అయింది. ఫ్యాక్టరీలు కేజీకి రూ.4 మాత్రమే ఇవ్వడంతో రైతులు మండిపడుతున్నారు.

ముంచుకొస్తున్న సీజన్‌..

మామిడి సీజన్‌ ముంచుకొస్తోంది. జిల్లా వ్యాప్తంగా మామిడి పూత ఈసారి విరగబూసింది. ఆకులు కనిపించకుండా పూత తోటలో అల్లుకుపోయాయి. ఈపూతను చూసి రైతులంతా తెగ మురిసిపోతున్నారు. కాయలకు కొదవలేదని తెగ సంబరపడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా దిగుబడి కూడా 12 లక్షల టన్నుల కాయలు దాటవచ్చునని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే ధరలు మాత్రం రానున్న సీజన్‌కు ఎలా ఉంటుందోనని రైతుల్లో అప్పుడే గుబులు పట్టుకుంది. గత ఏడాది తోలిన కాయలకే ఇప్పటికీ బిల్లులు అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం బాధాకరం

మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే వరకు రైతులకు అండగా ఉంటామని ప్రజాప్రతినిధులు చెప్పారు. ఇప్పుడు గిట్టుబాటు ధర రాలేదని రోడ్డెక్కితే ఎవరూ రావడం లేదు. కనీసం అసెంబ్లీలోనైనా మామిడి గోడును వినిపించాలి. ప్రతక్ష్యంగా మామిడి రైతులను పడ్డ కష్టాలను జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు చూశారు. వారు అసెంబ్లీలో మామిడి ప్రస్తావనను తేవకపోవడం బాధకారం.

–ఆనందనాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు

చెర్లోపల్లి మ్యాంగో ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన

పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చిత్తూరు మండలం చెర్లోపల్లి వద్ద ఉన్న హయత్‌ ఫ్యాక్టరీ ఎదుట ధర్నాకు దిగారు. కేజీకి రూ.4 వద్దని ఫ్యాక్టరీ యాజమాన్యంతో గొడవకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 8 ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఫ్యాక్టరీ, రైతులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రైతులు గేటు ఎదుట చుట్టుముట్టి ధర్నాకు దిగారు. తమ ఆవేదనను వెళ్లగక్కారు. ప్రాసెసింగ్‌ యూనిట్లను తామే నడిపేలా చూడాలని ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు.

చెప్పిన ధర చెల్లించాల్సిందే

మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలి. మాట మారిస్తే...ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే పరిస్థితి లేదు. రానున్న సీజన్‌లో మాత్రం రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగితో ఒప్పుకునేది లేదు. కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. గతేడాది తోలిన కాయలకు కేజీకి రూ.4 ఇస్తే ఎంతమాత్రం ఒప్పుకోం.

–హరిబాబు చౌదిరి, రైతు నేత, చిత్తూరు

మామిడి రైతు గోడు ఎవరికి చెప్పుకోవాలి?

మామిడికి కేజీకి రూ. 8 గిట్టుబాటు ధర అన్నారు. ఏ ఒక్క ఫ్యాక్టరీలోనైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గిట్టుబాటు ధర ఇచ్చారా..? మేము పండించిన పంటకు ఫ్యాక్టరీలు ధరలు నిర్ణయిస్తున్నాయి. కేజీకి రూ.4 మాత్రమే ఇస్తున్నారు. మేము అడిగితే ఇచ్చింది తీసుకోండి అంటూ వెళ్లిపోతున్నారు. దీనికి ఎవరు జవాబుదారీ. ఇప్పుడే ఈ రకంగా ఉంటే వచ్చే సీజన్‌లో మామిడి రైతుల పరిస్థితి ఏంటో భయమేస్తోంది.

–చంద్రమౌళిరెడ్డి, పట్నం, తవణంపల్లి మండలం

తోతాపోరు1
1/3

తోతాపోరు

తోతాపోరు2
2/3

తోతాపోరు

తోతాపోరు3
3/3

తోతాపోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement