నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బయో మెడికల్ వ్యర్థాల వల్ల ప్రజారోగ్యానికి, పర్యావరణానికి కలిగే ముప్పును నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్‌లు, బ్లడ్ బ్యాంక్‌ల నుంచి వచ్చే రక్తం, ప్లాసెంటా వంటి వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించి, రవాణా చేయాలన్నారు. రంగు–కోడెడ్ డబ్బాల ద్వారా వ్యర్థాలను తప్పనిసరిగా వర్గీకరించాలన్నారు. వ్యర్థాలను నాలుగు ప్రధాన రంగుల సంచులలో (పసుపు, ఎరుపు, తెల్లని,పారదర్శక, నీలం) వేరు చేయాలని ఆదేశించారు. ప్రతి ఆసుపత్రి యజమాని వ్యర్థాల నిర్వహణపై పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. మార్చి 28న నిర్వహించే తదుపరి సమీక్షా సమావేశం నాటికి స్పష్టమైన పురోగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో మోహన్‌కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 2 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,528 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. మార్చి 13 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సమస్యలు, ఫిర్యాదులకు డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే అభ్యర్థిని డిబార్ చేసి, ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేస్తామని డీఈవో హెచ్చరించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కలెక్టర్


