పకడ్బందీగా ఓటరు జాబితా సంక్షిప్త సవరణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ 74.45 శాతం పూర్తయిందన్నారు. జిల్లాలో 15,77,743 మంది ఓటర్లు ఉండగా 11,74,606 మంది వివరాల్ని మ్యాపింగ్ చేశామన్నారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ స్టేషన్ల పునర్ వ్యవస్థీకరణ, బీఎల్‌వోల నియామకాల్ని చేపట్టామన్నారు. గత ఆరు నెలల్లో తొలగించిన ఓటర్ల వివరాలు అందజేస్తామని, అభ్యంతరాలు సమర్పిస్తే నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో డీఆర్‌వో మోహన్‌కుమార్, గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఏపీఎంఐపీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మసేద్యం పరికరాల పంపిణీకి రైతుల సర్వేను పూర్తిచేయాలన్నారు. రైతుల వాటా చెల్లించిన వెంటనే మంజూరు ఉత్తర్వులు జారీచేసి, పరికరాలు అందజేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 1,386 మంది రైతులకు త్వరగా పరికరాలు అందించాలని ఆదేశించారు.


