అన్నింటా క్రమబద్ధకమే | - | Sakshi
Sakshi News home page

అన్నింటా క్రమబద్ధకమే

Feb 28 2026 7:28 AM | Updated on Feb 28 2026 7:28 AM

అన్నింటా క్రమబద్ధకమే

అన్నింటా క్రమబద్ధకమే

‘బీపీఎస్‌’ ఫైళ్లల్లో కనిపించని పురోగతి

అధికారుల లాగిన్‌లో ఆగిన

వందలాది ఫైళ్లు

ముందుకు కదలని ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

చిత్తూరు కార్పొరేషన్‌లో ‘ప్రణాళిక’ ఏదీ..?

పట్టణాలు, నగరాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్‌)ను అమలుచేస్తోంది. అలాగే అనధికారిక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లను సక్రమం చేసుకోవడానికి లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ను తీసుకొచ్చింది. దీంతో ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారు. చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనూ వేలాది అర్జీలు వచ్చాయి. వాటిని కొందరు అధికారులు ముందుకు కదలించకుండా తమ వద్దే అట్టిపెట్టుకుంటున్నారు. మధ్యవర్తుల ద్వారా దరఖాస్తుదారుల నుంచి భారీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసిన వారు, వాటిలో స్థలాలు కొనుగోలు చేసిన వారు క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం గతేడాది అవకాశం కల్పించింది. 2025 జూన్‌ 30వ తేదీ నాటికి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారంతా ఎల్‌ఆర్‌ఎస్‌ పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు చిత్తూరులో 380 దరఖాస్తులు అందాయి. అలాగే 1995 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు జరిగిన భవనాల నిర్మాణాల్లో మునిసిపాలిటీల నుంచి తీసుకున్న ప్లాన్‌ ప్రకారం కాకుండా అతిక్రమణలు జరిగిన భవనాలు, అసలు ప్లాన్‌ తీసుకోకుండా ఉన్న భవనాలను సక్రమం చేసుకోవడానికి బీపీఎస్‌ పథకాన్ని తీసుకొచ్చారు. వచ్చే నెల 11వ తేదీతో బీసీపీఎస్‌కు గడువు ముగియనుంది. ఈ రెండు పథకాలకు 600లకు పైగా దరఖాస్తులు అందాయి. కార్పొరేషన్‌కు దాదాపు రూ.8 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తోంది.

ఎక్కడికక్కడే..!

ప్రజల నుంచి వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ ఫైళ్లను కార్పొరేషన్‌లోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. తర్వాత వాటిని క్రమబద్ధీకరించి కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయంపై దృష్టి సారించాలి. ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయం కన్నా, సొంత ఆదాయంపై దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల లాగిన్లలో వందలాది ఫైళ్లు నెలల తరబడి పేరుకుపోయాయి. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం లేదు. ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్‌ చేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న ప్రజలు అనుమతుల కోసం ఇంజినీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు వ్యక్తులు దళారుల అవతారం ఎత్తారు. తాము పనులు చేయిస్తామని నమ్మబలికి పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతున్నారు. ఒకరిద్దరు అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పిదాలకు ప్రణాళిక విభాగం మొత్తం ప్రజల ఎదుట అవినీతి మరకలు అంటించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల లాగిన్‌లో ఉన్న ఫైళ్లకు ఏవైనా పత్రాలు కావాలా..? అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా జత చేశారా..? క్షేత్రస్థాయిలో వాటి పరిస్థితి ఏంటి..? అనే విషయాలు పట్టించుకోకపోవడంతో దరఖాస్తుదారుల నుంచి ఏదో ఆశిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement