రైతు కంట సహకారం
శ్రీరంగరాజుపురం సొసైటీలో రుణాల గోల్‌మాల్
తప్పుడు రికార్డులతో రుణాలు స్వాహా
నకిలీ పత్రాలతో
టీడీపీ నేత రూ.లక్షల్లో బురిడీ
ఆలస్యంగా వెలుగుచూసిన బాగోతం
తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలు
ఆందోళన చెందుతున్న రైతులు
శ్రీరంగరాజుపురం: మండల కేంద్రమైన శ్రీరంగరాజుపురంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం బ్యాంకు ఉంది. ఇందులో 15 ఏళ్ల నుంచి సుమారు 2 వేల మంది రైతులు రుణాలు తీసుకుంటున్నారు. ప్రతి రైతుకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు. ఈ సింగిల్ విండోలో ప్రస్తుతం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. 2011 – 2019 మధ్య టీడీపీ నేతలు నకిలీ భూమి పత్రాలు చూపించి రూ.లక్షలు తీసుకుని సొసైటీని బురిడీ కొట్టినట్టు తేలింది. సాధారణంగా సహకార బ్యాంకు అధికారులు సామాన్య రైతులకు వ్యవసాయ పంట రుణాలు, గృహ రుణాలు ఇవ్వాలంటే సవాలక్ష ఆంక్షలు పెట్టి నరకం చూపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డీడీ, పట్టాదారు పాసుబుక్, వన్‌బీ, అడంగల్, ఈసీ, స్కెచ్, ఇంటి పన్ను తదితరాలు తప్పనిసరిగా తీసుకురావాల్సిందేనని చెబుతున్నారు. అదే టీడీపీ అండదండలుంటే ఏవీ లేకుండానే రుణాలు మంజూరు చేస్తున్నారు.
ఉద్యోగుల సహకారం?
రుణాల మంజూరులో సహకార ఉద్యోగులు సహకరించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ పత్రాలని తెలిసే రుణాలు మంజూరు చేసినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అర్హులైన రైతుల కడుపుకొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా దొంగ పత్రాలు సృష్టించడంలో టీడీపీ నేతలకు కొమ్ము కాశారని మండిపడుతున్నారు.
రైతులను ముంచేస్తున్నారు..
మా నాన్నమ్మ పేరుతో 2.50 ఎకరాల భూమి ఉంది. దానికి 2011లో మాకు తెలియకుండా తప్పుడు పత్రాలు తయారు చేసుకుని సహకార బ్యాంకులో లోను తీసుకున్నారు. ఇటీవల మేము బ్యాంకు లోను కోసం వెళితే ఆ భూమి మీదు లోను ఇచ్చా మని అధికారులు తెలిపారు. ఎలా ఇచ్చారనే విషయం తెలియడంలేదు. ఇదేమని ప్రశ్నిస్తే అధికారులు నోరు మెదపడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. లేకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.
– మోహన్‌రెడ్డి, ఎల్లంపల్లి,
శ్రీరంగరాజుపురం
చర్యలు తీసుకుంటాం
భూమిపై 2011లో తప్పుడు పత్రాలు సృష్టించారనే విషయం నాకు తెలియదు. బాధిత రైతులు ఫిర్యాదు చేస్తే కచ్చితంగా స్పందిస్తాను. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తాను. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వాస్తవాలు తెలుసుకుని నిజంగా ఆ పత్రాలు నకిలీవని తేలితే చర్యలు తీసుకుంటాం.
– లోకనాథపిళ్లై, తహసీల్దార్, శ్రీరంగరాజుపురం
రెవెన్యూ రికార్డుల ప్రకారమే..
రెవెన్యూ అధికారులు ఇచ్చిన రికార్డుల ప్రకారమే మేము రుణాలు ఇస్తాం. ఒక వేళ అవి నిజమైన పత్రాలు కావని రైతులు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అర్హులైన రైతులకు న్యాయం చేస్తాం.
– రాజారెడ్డి, సింగిల్ విండో సీఈవో,
శ్రీరంగరాజుపురం
బయటపడిందిలా..
శ్రీరంగరాజపురం సింగిల్‌విండోలో రుణాల గోల్‌మాల్ వెలుగు చూసింది. టీడీపీ నేతలు తప్పుడు భూమి పత్రాలతో రూ.లక్షలు తీసుకుని స్వాహా చేశారు. అధికారులు రుణం కోసం వెళ్లిన అసలైన రైతులకు మొండిచేయి చూపారు. రైతులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్లంపల్లికి చెందిన కొందరు రైతులు ఇటీవల రుణం కోసం సహకార బ్యాంకుకు వెళ్లారు. అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించి ఈ భూమిపై రుణం తీసుకున్నట్లు చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. తాము అసలు రుణాలు తీసుకోలేదని తెలిపారు. రికార్డులు చూడడంతో పత్రాలు తారుమారైనట్టు తెలుసుకున్నారు. అధికారులను నిలదీశారు. విషయం బట్టబయలవుతుందని తెలుసుకున్న సహకార ఉద్యోగులు ఫైలును దాచి పెట్టేశారు. ఈ వివాదం ఆ టీడీపీ నేత చెవిలో పడడంతో మేనేజర్‌కు బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. దీనిని కప్పిపుచ్చేందుకు సహకార ఉద్యోగులు, ఆ టీడీపీ నేత విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బాధిత రైతులు మాత్రం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇదిగో సాక్ష్యం
శ్రీరంగరాజుపురం మండలం 52 కనికాపురానికి చెందిన ఒక మహిళా రైతు పేరిట 41/7, 41/8, 43/3 సర్వే నంబర్లల్లో రికార్డు పరంగా 2.50 ఎకరాల భూమి ఉంది. ఇదే సర్వే నంబర్లను ఉపయోగించి ఒక టీడీపీ నేత తప్పుడు పత్రాలు తయారు చేసుకున్నాడు. ఒరిజినల్ రికార్డులోని 2.50 ఎకరాల భూమిని 8.51 ఎకరాలుగా డూప్లికేట్ వన్‌బీ సృష్టించాడు. వాటితో 2011లో శ్రీరంగరాజపురం ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇలా పలు దొంగపత్రాలతో సుమారు రూ.30 లక్షలకు పైగా రుణం తీసుకున్నాడు. అలాగే తప్పుడు పత్రాలతో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, రాయితీ యంత్రాలను కొట్టేశాడు.
రైతు కంట సహకారం
రైతు కంట సహకారం
రైతు కంట సహకారం


