ఇంటర్ పరీక్షలపై నిఘా
రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం మార్చి 24 వరకు పబ్లిక్ పరీక్షలు ప్రశ్నపత్రాలు, మార్కుల్లో మార్పులు పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు వేళయింది. ఈనెల 23 నుంచి మొదటి సంవత్సరం, 24 నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంటర్‌లో చేపట్టిన సంస్కరణల మేరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రా లు, మార్కుల్లో మార్పులు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలను నిఘా నీడలో నిర్వహించేలా అధికారులు చర్య లు చేపట్టారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు చేపట్టిన కసరత్తుపై కథనం.
చిత్తూరు కలెక్టరేట్ : పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. సోమవారం మొదటి, మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మొదలై, మార్చి 24 వరకు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని డీఐఈవో రఘుపతి వెల్లడించారు.
ప్రత్యేక పర్యవేక్షణ
జిల్లాలో నాలుగు సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించారు. వీటిపై ప్రత్యేక నిఘాతో పాటు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను 25 స్టోరేజీ పాయింట్‌ల నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య కేంద్రాలకు చేరవేస్తున్నారు. జిల్లాలో మొదటి సంవత్సరానికి 14,729, ద్వితీయ సంవత్సరానికి 14,544 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వృత్తి విద్యకు సంబంధించి మొద టి, ద్వితీయ సంవత్సరం కలిపి 3,298 మంది పరీక్షలు రాయనున్నారు.
రాష్ట్ర కార్యాలయంతో అనుసంధానం
జిల్లాలో నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వ హణ తీరును రాష్ట్ర కార్యాలయం వీక్షించేలా అను సంధానం చేశారు. పరీక్షల నిర్వహణను ప్రతిక్షణం పర్యవేక్షించేలా ఇంటర్ బోర్డు కార్యాలయం, రాష్ట్ర బోర్డు కార్యాలయానికి సీసీ కెమెరాల అనుసంధానం చేశారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. సమస్యలు ఉంటే జిల్లా ఇంటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 8712686281కు సమాచారం ఇవ్వాలని డీఐఈవో సూచించారు.
ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు
పరీక్షలను పూర్తీగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నారు. 50 కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్‌లను నియమించారు. ప్రైవేట్ కేంద్రాల్లో సహాయ చీఫ్ సూపరింటెండెంట్‌లు సైతం ఉండేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణపై చీఫ్, ఇన్విజిలేటర్‌లకు శిక్షణ తరగతులు పూర్తి చేశారు. అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగ్గా ఉండేలా, 144 సెక్షన్ అమలు, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లా సమాచారం
మొదటి సంవత్సరం విద్యార్థులు 14,729
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,544
సిట్టింగ్ స్క్వాడ్‌లు 03
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 03
ఇన్విజిలేటర్లు 600
పరీక్షలకు ఏర్పాటు చేసిన కేంద్రాలు 50
అరగంట ముందే చేరుకోవాలి
విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలి. కేంద్రాల చిరునామాను ముందే ఒకసారి వెళ్లి చూసుకుంటే మంచిది. ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలి. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. తప్పులు చేస్తే ఎంత వారైనా వదిలే ప్రసక్తే లేదు. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే ఇన్విజిలేటర్‌లను మాత్రమే అడగాలి. స్లిప్‌లు, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. – రఘుపతి, డీఐఈవో, చిత్తూరు
ఇంటర్ పరీక్షలపై నిఘా


