తల్లిదండ్రులూ..ఆత్మ విశ్వాసాన్ని నింపండి!
ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా దగ్గరుండి ధైర్యం చెప్పి ఉత్తమ మార్కులు సాధిస్తారని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. పిల్లల వద్ద కూర్చొని సాధన చేయిస్తూ తగిన విశ్రాంతిని కల్పిస్తూ పరీక్షలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పరీక్షల సమయంలో జంక్‌ఫుడ్‌కు పిల్లలను దూరంగా ఉంచి పౌష్టికాహారాన్ని అందించే ప్రయత్నం చేయాలి. పరీక్ష కాలంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఏకాగ్రత దెబ్బ తినకుండా, నిద్రలేమికి గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలను సెల్‌ఫోన్లు, స్నేహితులకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. రోజుకు సుమారు 8 గంటల పాటు చదివించేందుకు కృషి చేయాలి. మానసిక ప్రశాంతత కోసం రోజుకు 20 నిమిషాల పాటు వ్యాయామం, యోగా చేస్తే పిల్లలు ఒత్తిడిని జయించే అవకాశం ఉంటుందని వైద్యులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు పిల్లలను గంట సమయం ముందే తీసుకెళ్లడం తల్లిదండ్రుల బాధ్యతే. – తిరుపతి సిటీ


