వీఐపీ గేటుకు తాళం
కాణిపాకంలో ప్రోటోకాల్ పేరిట పెరిగిన వీఐపీ దర్శనాలు
దళారులను కట్టడి చేయలేక తాళాలు
రెండు నెలలుగా వీఐపీ ద్వారం మూత
లోలోపల రగిలిపోతున్న కొందరు ఉభయదారులు
కాణిపాకంలో వీఐపీ గేటును సిఫార్సులు చుట్టిముట్టేస్తున్నాయి. ప్రోటోకాల్ పేరుతో కుప్పలుతెప్పలుగా వచ్చిపడిపోతున్నారు. దళారులకు వీఐపీ దారి అడ్డాగా మారింది. వీటిని కట్టడి చేయలేక వీఐపీ గేటుకు బ్రేకులు వేశారు. రెండు నెలలుగా ద్వారానికి తాళం వేసి ఉంచారు. ఇది భక్తుల మధ్య, ముఖ్యంగా ఉభయదారుల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది.
కాణిపాకం: గత వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం కొండంత అభివృద్ధి చెందింది. దీంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య 10 వేలు దాటుతోంది. శని, ఆదివారాల్లో 30 వేల వరకు వస్తున్నారు. దీనికితోడు డిసెంబర్‌లో అయ్యప్ప స్వామి భక్తులు అధికమయ్యారు. ఈ కారణంగా కాణిపాక దేవస్థానంలోని అన్ని గేట్లు కిక్కిరిశాయి. వీఐపీ గేటు వద్ద కూడా తాకిడి పెరిగింది. ఈ క్రమంలో వీఐపీ గేటు ఎదుట సిబ్బందికి, అయ్యప్పస్వామి భక్తులు, సామాన్య భక్తులకు గొడవ చోటుచేసుకుంది. అలాగే ప్రోటోకాల్ పేరిట వీఐపీ దర్శనాలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోయాయి. ఇలా వీఐపీ గేటును సిఫార్సులు చుట్టుముట్టేయడంతో ఆ మార్గంలో భక్తుల రద్దీ సాధారణ క్యూలైన్లను మించిపోయాయి. దీంతో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ రద్దీని తట్టుకోలేక అధికారులు గత రెండు నెలలుగా వీఐపీ ద్వారానికి తాళం వేశారు. అనధికారిక ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేశారు.
దళారుల దందాకు అడ్డా
ఈ వీఐపీ ద్వారం వద్ద దళారుల దందా విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. భక్తుల నుంచి భారీగా వసూలు చేస్తూ, సిఫార్సుల ముసుగులో దర్శనాలు చేయించే వారిని కట్టడి చేయడంలో ఆలయ యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలను అరికట్టే ధైర్యం లేక, ఏకంగా ద్వారాన్నే మూసివేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
కూటమి పెత్తనం
కూటమి నాయకులమంటూ చాలామంది అక్కడ పెత్తనం చలాయిస్తున్నారని పలువురు ఉభయదారులు మండిపడుతున్నారు. వారు ఇష్టారాజ్యంగా భక్తులను తీసుకెళ్లి దర్శనాలు చేయించుకుంటూ.. జేబులు నింపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీని కారణంగా ఆలయ ఆదాయానికి గండిపడుతోందని వారు ఆగ్రహానికి గురవుతున్నారు.
తాళం పడిన వీఐపీ గేటు
ఉభయదారుల మండిపాటు
వీఐపీ గేటుకు తాళం వేయాలనే నిర్ణయంతో కొందరు ఉభయదారులు ఆగ్రహానికి గురవుతున్నారు. స్వామివారి సేవలో భాగస్వాములైన తమకు దక్కాల్సిన కనీస ప్రాధాన్యత దక్కడం లేదంటున్నారు. సాధారణ భక్తులతోపాటు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని వారు లోలోపల రగిలిపోతున్నారు. సిఫార్సులను ఆపలేక, ఉండే గౌరవాన్ని కూడా తీసేస్తారా అని దాతలు ప్రశ్నిస్తున్నారు.
వీఐపీ దర్శనానికి లోటు లేదు
వీఐపీ గేటు వద్ద కుప్పలు తెప్పలుగా సమస్యలు వస్తున్నాయి. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా.. ఆలయానికి చెడ్డ పేరు రాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రోటోకాల్ దర్శనాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. వీఐపీలకు దగ్గరుండి సేవలు అందిస్తున్నాం. – పెంచల కిషోర్, ఈఓ, కాణిపాకం
తాళంతో.. ఆదాయం
రెండు నెలలుగా వీఐపీ గేటుకు తాళం పడడంతో ఆలయం ఆదాయం పుంజుకుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. వచ్చిన భక్తులంతా వీఐపీ గేటుకు తాళం చూసి రూ.150 దర్శనం గేటు వద్ద క్యూ కడుతున్నారన్నారు. అలా ఆ గేటు వద్ద భక్తులు క్యూ కట్టడం, టిక్కెట్ కొనుగోలు పెరగడంతో ఒక నెలకు రూ.50 లక్షల ఆదాయం వచ్చిందంటున్నారు.
వీఐపీ గేటుకు తాళం


