డాక్టరేట్ ‘పైసల్’!
రూ.పదివేలిస్తే డాక్టరేట్ సిద్ధం జిల్లాలో వంద మందిదాకా ఫేక్ డాక్టరేట్లు పొందిన వైనం ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో రహస్య నెట్‌వర్క్
పలమనేరు: విశ్వవిద్యాలయాలు గౌరవంగా అందజేసే గౌరవ డాక్టరేట్లు అంగట్లో సరుకులా మారాయి. పది వేలు ఇస్తే ఎవరికై నా సరే గౌరవ డాక్టరేట్లు రెడీ అవుతున్నాయి. కొన్ని ఫేక్ యూనివర్సిటీలు, అకాడమీలు తమ ఏజెంట్ల ద్వారా నెట్‌వర్క్ నడిపిస్తూ అదే విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ దందాని కొనసాగిస్తున్నాయి. గతంలో కర్ణాటకలోని మైసూరులో నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ల ప్రదానంపై అక్కడి పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ పలు ఫేక్ యూనివర్సిటీల నుంచి పదుల సంఖ్యలో గౌరవ డాక్టరేట్లు పొందినట్టు అక్కడి పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఎవరెవరూ ఎంత డబ్బు చెల్లించి వీటిని పొందారో కూడా నిర్వాహకులు బయటపెట్టేశారు. అయితే ఆ డబ్బు తమ అకాడమీకి డాక్టరేట్ గ్రహీతలు బహుమతిగా ఇచ్చారని చెప్పినా ఆఖరుకు బుక్కయ్యారు. ఇలా ఫేక్ గౌరవ డాక్టరేట్లు పొందిన వారు ఆందోళనలో మునిగిపోయారు. తాజాగా పాండిచ్చేరికి చెందిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ అకాడమీ పేరిట కనీసం డాక్టరేట్‌కు స్పెలింగ్ రాని వారికి కూడా గౌరవ డాక్టరేట్లను ఇచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో దీన్ని చూసిన జనం నవ్వుకుంటున్నారు.
అమాయకులను టార్గెట్ చేసి..
ముందుగా ఆయా ప్రాంతాల్లో బాగా డబ్బున్న అమాయకులను ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. కొందరు రెప్‌లు పట్టణాల్లో తిరుగుతూ అక్కడి వీఐపీలను గుర్తిస్తారు. ఆపై ఫలానా యూనివర్సిటీ నుంచి వచ్చామని.. మీ సేవలకు మెచ్చి తాము గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామని చెప్పి కరస్పాండింగ్స్ చేస్తారు. తొలుత అతా ఉచితమేనని.. మీరు చెప్పిన చోటుకు ఫ్యామిలీతో రావాల్సి ఉంటుందని నమ్మబలకుతారు. ఆపై సూట్, కోట్‌కు మాత్రం రూ.10 వేలు ఇవ్వాలంటూ వసూలు చేస్తారు. కార్యక్రమ నిర్వహణకు లక్ష డొనేషనన్‌గా ఇవ్వాలని.. కాదు కుదరదంటే పదివేలైనా ఇస్తే చాలంటూ సర్దుకుంటారు. ఇలా కొందరు లక్ష, 50 వేలు ఇచ్చినోళ్లు జిల్లాలో ఉన్నారు. డాక్టరేట్ ప్రదాన కార్యక్రమంలో మెడల్, సర్టిఫికెట్‌కు అయ్యే ఖర్చు రూ.2 వేలు మాత్రమే.
జిల్లాలో వంద మంది దాకా!
గత ఐదేళ్లలో రూ.10 వేల నుంచి రూ.లక్ష దాకా డబ్బులు చెల్లించిన అమాయక వీఐపీలు జిల్లాలో వంద మందిదాకా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో రాజకీయ నాయకులు, రిటైర్ట్ అధికారులు, అధ్యాపకులు, ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, రియల్టర్లు, బిల్టర్లు, స్వచ్ఛందసంస్థల నిర్వాహకులు, శాస్త్రవేత్తలు తదితరులున్నట్టు సమాచారం. తాజాగా తిరుమల నిత్యాన్నదానానికి కూరగాయలు పంపే సేవకుడు, ఓంశక్తి గుడికి భక్తులను ఉచితంగా పంపే వ్యక్తికి సైతం పుదుచ్చేరిలో గౌరవ డాక్టరేట్‌లివ్వడం సోషల్ మీడియా ద్వారా వెలుచూసింది. ఇలా అమాయకులను బురిడీకొట్టించి ఫేక్ డాక్టరేట్లు ఇస్తున్న వారిపై జిల్లా పోలీసులు దృష్టి సారించాలనే మాట ప్రజల్లో వినిపిస్తోంది.
ఫేక్ యూనివర్సిటీలు ప్రదానం చేసిన నకిలీ డాక్టరేట్లు
నకిలీ యూనివర్సిటీల మాయాజాలం
ఫేక్ యూనివర్సిటీల హల్‌చల్
పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలు ఫేక్ యూనివర్సిటీలు డబ్బులకు డాక్టరేట్లను విక్రయించే వ్యాపారాలు చేస్తున్నాయి. కోయంబత్తూరు, చైన్నె, బెంగళూరు, మైసూరు, పాండిచ్చేరి కేంద్రాలుగా యూనివర్సల్ పీస్ యూనివర్సిటీ(యూఎస్‌ఏ), మలేషియా లింకోక్వింగ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గ్లోబల్ ఆక్స్‌పర్డ్ తదితరాలు గత ఐదేళ్లుగా నకిలీ డాక్టరేట్లను అందిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. తాజాగా వీటి జాబితాలోకి ఆసియా ఇంటర్నేషనల్ అకాడమీ కూడా చేరింది.
డాక్టరేట్ ‘పైసల్’!


