రేపటి నుంచి ‘సిద్ధార్థ’ సిల్వర్ జూబ్లీ వేడుకలు
తిరుపతి కల్చరల్: సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వేడుకగా చేపడుతున్నట్లు ఆ కళాశాల చైర్మన్ కె.అశోక్ రాజు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27, 28వ తేదీల్లో భారతీయ సంప్రదాయం మేరకు హోమాలతో ప్రారంభమయ్యే వేడుకలు ఫిబ్రవరి 8వతో ముగిస్తాయని తెలిపారు. 29న తమ విద్యార్థులు వ్యర్థ వస్తువులతో తయారుచేసిన రోబోలు, గన్స్, హెలికాప్టర్ వంటి సుమారు 65 వస్తువులను ప్రదర్శన ఉంటుందన్నారు. 30న కళాశాలలోని అన్ని విభాగాల వర్క్‌షాపు, 31న ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థుల ప్రాజెక్టు ఎగ్జిబిషన్, ఫిబ్రవరి 1న 24 గంటల పాటు హ్యాకథాన్ పేరుతో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి విచ్చేసే 1,750 డెలిగేట్ల వివిధ అపరిష్కృత సమస్యల పరిష్కార మార్గాలు కార్యక్రమం చేపట్టడంతో పాటు సమస్య పరిష్కారాలు చూపిన వారికి రూ.3.50లక్షలు బహుమతిగా ఇస్తామని తెలిపారు. 2న అన్ని విభాగాల కార్యక్రమాలు నిర్వహణ, 3న నైపుణ్యాలపై పత్రాలు సమర్పణ, 4న మన సంస్కృతి,సాంప్రదాయాలు తెలిపేలా ప్రముఖ ప్రవచనకర్త ప్రసంగం, 5న పేరెంట్స్ డే, 6న స్పోర్ట్స్ డే, 7న తమ విద్యాసంస్థ పూర్వ విద్యార్థులచే జూనియర్లకు విజ్ఞానం పెంచేందుకు ఆన్‌లైన్ తరగతుల, 8న సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ కళాశాల వేడుకలకు సినీ నటి మీనాక్షి చౌదరి, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.


