
అనుమానాస్పదస్థితిలో వృద్ధుడి మృతి
తవణంపల్లె : మండలంలోని తెల్లగుండ్లపల్లెలో శనివారం రాత్రి రంగయ్యనాయుడు (78) అనే వృద్ధుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు చిత్తూరు రూరల్ సీఐ శ్రీధర్ నాయుడు తెలిపారు. వివరాలు.. తన చెల్లెలు కుమారుడిని సైకిల్‌పై తిప్పుతున్నాడని హేమాద్రి అనే యువకుడిపై రంగయ్యనాయుడు చేయిచేసుకున్నాడు. ఈ విషయాన్ని హేమాద్రి తన ఇంట్లో వాళ్లకి ఫిర్యాదు చేశాడు. దీంతో హేమాద్రి అన్న బాలాజీ మరో ముగ్గురు యువకులతో వచ్చి రంగయ్యనాయుడిని నిలదీయగా గొడవ జరిగింది. తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం రంగయ్యనాయుడు తన ఇంటి ముందు షెడ్డులో ఉరివేసుకుని ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. రంగయ్యనాయుడుతో గొడవపడిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. మృతుడి కుమార్తె జనప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆగని ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): పంట పొలాలపై ఏనుగుల దాడి ఆగడంలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలోని దేవళంపేట పంచాయతీలోని కొమ్మిరెడ్డిగారిపల్లె, దిగవమూర్తివారిపల్లెలో ఆదివారం తెల్ల వారుజామున ఏనుగుల గుంపు మామిడి చెట్లను వేళ్లతో సహా పెకళించేశాయి. దీంతోపాటు వంకాయ పంట, వేరుశెనగ పంటను తొక్కి నాశనం చేశాయి.