
అయ్యా.. న్యాయం చేయండి
● కలెక్టరేట్‌కు క్యూ కట్టిన ఫిర్యాదుదారులు
● వివిధ సమస్యలపై 289 వినతుల స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్రస్థాయి అధికారుల వద్దకు ఎన్ని సార్లు వెళ్తున్నా తమకు న్యాయం జరగడం లేదని.. తమరైనా కల్పించుకుని న్యాయం చేయండంటూ పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డీఆర్‌వో మోహన్ కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందజేసిన ప్రతి వినతినీ పరిష్కరించాలని చెప్పారు.
1.40 ఎకరాలను తగ్గించేశారు
‘నా కుమారుడు పేరుతో ఆన్‌లైన్‌లో నమోదై ఉన్న 3.06 ఎకరాలను 1.4 ఎకరాలను తగ్గించి మరొకరి పేరు పై మా భూమిని రెవెన్యూ అధికారులు మార్చేశారు’ అని జీడీ నెల్లూరు మండలానికి చెందిన బాధితుడు చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనతో పాటు పలువురు బాధితులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ గంగాధరనెల్లూరు మండలం, వరత్తూరు రెవెన్యూ గ్రామం దళవాయిపల్లిలో తాము నివసిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యవస్థ రాకముందు చిత్తూరు తాలూకా కార్యాలయం నుంచి రైతు పాసుపు స్తకం సర్వే నం.359–1 లో 3.06 ఎకరాలను మంజూరు చేసి ఉన్నారన్నారు. అనంతరం వంశపారంపర్యంగా కుమారుడైన తన పేరుతో పట్టా నం.585తో పాసుపుస్తకం ఇచ్చారని తెలిపారు. అనంతరం అనువంశికము విధానంలో తన పేరు మీద ఉన్న భూమిని కుమారుడైన ప్రవీణ్‌రెడ్డికి రాసివ్వగా 1592 పాసుపుస్తకం ఇచ్చారని తెలిపారు. ఇటీవల మీభూమి వెబ్‌సైట్‌లో పరిశీలించగా 1.40 ఎకరాలే తగ్గించినట్టు గుర్తించామన్నారు. ఈ విషయం జీడీ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన గోవిందరెడ్డికి చెందిన సర్వే నం.363/4 ఏలో 0.07 సెంట్లు, కమలమ్మకు చెందిన సర్వే నం.363/1 ఏలో 1.45 ఎకరాలు, సర్వే నం.363/2 ఏలో 0.1750 సెంట్లు, చంద్రారెడ్డికి చెందిన సర్వే నం.65/2 ఏలో 1.15 ఎకరాలు, ప్రవీణ్‌రెడ్డికి చెందిన సర్వే నం.359/1 ఏలో 1.41 ఎకరాలు మొత్తం 4.55 1/2 ఎకరాల భూమిని జీడీ నెల్లూరు తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఎటువంటి భూమీలేని భానుప్రకాష్ అనే అతని పేరుపైకి మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడీ నెల్లూరు కార్యాలయంలో పనిచేసే వరత్తూరు వీఆర్‌వో సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ ఏకాంబరం, డీటీ తులసీరామ్, రిటైర్డ్ తహసీల్దార్ చంద్రశేఖర్ సదరు వ్యక్తి వద్ద రూ.15 లక్షలు లంచం తీసుకుని తమ భూమిని ఆయన పేరుపై మార్చేశారన్నారు. న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను వేడుకున్నారు.
రోడ్డు వేయించండి సారూ..
తమ గ్రామానికి రోడ్డు వేయించండి సారూ అంటూ ఐరాల మండలం, అబ్బగుండు గ్రామానికి చెందిన ప్రజలు వాపోయారు. ఈ మేరకు వారు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ అబ్బగుండు గ్రామానికి రహదారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పూర్వీకుల కాలం నుంచి తమ గ్రామానికి రహదారి లేదన్నారు. తమ గ్రామం నుంచి ఐరాల, చిత్తూరుకు నిత్యం పలువురు బతుకుదెరువుకు వెళ్తుంటారని.. ఉన్న రహదారి మొత్తం గుంతల మయం కావడంతో ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని స్థితి ఉందన్నారు. తమ సమస్యను పలుమార్లు ఎమ్మెల్యే, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదన్నారు.

అయ్యా.. న్యాయం చేయండి