
సాక్షి, చిత్తూరు జిల్లా : గంజాయి స్మగ్లర్లకు టీడీపీ అడ్డాగా మారిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఓ గంజాయి మొక్కని మరోసారి నిరూపితమైంది. అధికార పార్టీ టీడీపీకి చెందిన కార్యకర్త ఒకరు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కనమాకుల పల్లె గ్రామానికి చెందిన బీసీ రెడ్డప్పను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశాలోని గంజాం జిల్లా బెర్హంపురంలో ఇటీవల స్థానిక పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రెడ్డప్ప లారీ యూఎల్ 4509 పేరుతో నంబర్ ఉండగా పోలీసులు వాహనాన్ని అడ్డుకున్నారు. దేశంలో ఎక్కడ యూఎల్‌తో రాష్ట్ర రిజిస్ట్రేషన్ లేకపోవడంతో అనుమానించిన పోలీసులు తనిఖీలు చేయగా.. లారీలో 50 కిలోల గంజాయి లభించింది.
దీంతో రెడ్డప్పను పోలీసులు అదుపులోకి తీసుకొని.. లారీతో సహా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు రెడ్డప్ప గత కొన్నేళ్లుగా కుప్పం నియోజకవర్గం పరిధిలో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.