
● తెలుగు తమ్ముళ్లలో భగ్గుమన్న విభేదాలు ● రెండు వర్గాలుగ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ పార్టీలో ఇటీవల వర్గవిభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేకం పేరుతో రెండు వర్గాలు తయారయ్యాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే థామస్ పీఎ చంద్రశేఖర్ అవినీతిపరుడు అంటూ శుక్రవారం ఓ వర్గంవారు కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నేత గుండయ్య, ఎమ్మెల్యే థామస్ సొంత తమ్ముడు నిధి, హరిబాబు నాయుడు మరికొందరు నాయకులు కలిసిఎమ్మెల్యే లెటర్ ప్యాడ్లను పీఏ చంద్రశేఖర్ అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యేను అవినీతి కూపంలోకి దింపుతున్నాడని, మన్నారుగుడి మాఫియాలా ఎమ్మెల్యే చుట్టూ అవినీతిపరులే ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తమ్ముళ్ల కుమ్ములాట బయటపడింది.
వ్యతిరేకులంతా చీడపురుగులన్న ఎమ్మెల్యే
కలెక్టర్‌కు పలువురు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే థామస్ ఓ వీడియో విడుదల చేశారు. తన వద్ద 8 నెలలుగా పనిచేస్తున్న పీఏ చంద్రశేఖర్ చాలా మంచి వాడని, తన వ్యతిరేకులందరూ చీడపురుగులని ఆరోపించారు. ప్రధానంగా పీఏపై ఫిర్యాదు చేసిన వారు స్వార్థపరులను మండిపడ్డారు. అవినీతిపరులందరూ జట్టు కట్టి తనను రాజకీయంగా అణగదొక్కాలని యత్నిస్తున్నట్లు విమర్శించారు. వారు చెప్పిన పనులు చేయనందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. పీఏ చంద్రశేఖర్ గతంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే వద్ద పనిచేశాడని, ప్రస్తుతం మంత్రుల వద్ద ఓఎస్డీలుగా గత ప్రభుత్వంలో పని చేసిన వారు లేరా అని ప్రశ్నించారు.
గుండయ్య అవినీతిపరుడు
ఎమ్మెల్యే పీఏ పై ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎస్సీ సెల్ నేత గుండయ్య అవినీతిపరుడని ఎమ్మెల్యే పేరు చెప్పుకుని రూ.లక్షలు వసూలు చేశాడని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకుల వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సాధారణ పేద కుటుంబానికి చెందిన గుండయ్య తిరుపతిలో మూడంతస్తుల భవనం, వేలూరులో ఒక భవనం, ఎస్‌ఆర్ పురంలో మూడంతస్తుల భవనం ఎలా నిర్మించాడని వీడియోల్లో వెల్లడిస్తున్నారు. పెనుమూరుకు చెందిన ఓ నేత మాట్లాడుతూ గుండయ్య తన వద్ద రూ.లక్షలు తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే థామస్ పీఏపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు (ఫైల్)
క్రమశిక్షణ తప్పితే చర్యలు
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రేగిన రాజకీయ రగడపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీఆర్ రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఎలాంటి ప్రెస్‌మీట్‌లు నిర్వహించకూడదని, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళతామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే ఆ సమావేశంలో చేసుకోవాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణను తప్పితే ఎంతటి వారిపై అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

● తెలుగు తమ్ముళ్లలో భగ్గుమన్న విభేదాలు ● రెండు వర్గాలుగ