మేసీ్త్ర కుమార్తె సన్‌షైన్ అవార్డుకు ఎంపిక
● ఇంటర్ ఫలితాల్లో మెరిసిన కూలీబిడ్డ ● ఈనెల 15న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
చిత్తూరు కలెక్టరేట్ /రొంపిచర్ల : మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్న శివన్న, దేవమ్మ దంపతుల కుమార్తె శ్రావంతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించింది. జిల్లాలోని రొంపిచెర్ల కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ)లో ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూపు పూర్తి చేసింది. ఈ నెల 12న విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థిని 1000 మార్కులకు గాను 935 మార్కులు సాధించింది. పేద కుటుంబంలో జన్మించి ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రావంతి రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న సన్‌షైన్ అవార్డుకు ఎంపికై నట్లు జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ వెంకట రమణ వెల్లడించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆ విద్యార్థిని మట్టిలో మాణిక్యంలా ఉత్తమ ఫలితాలు సాధించడంపై పలువురు అభినందించారు. అవార్డుకు ఎంపికై న ఆ విద్యార్థిని ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి లోకేష్ చేతుల మీదుగా విజయవాడలో సన్‌షైన్ అవార్డును స్వీకరించనుంది. ఉత్తమ ఫలితాలు సాధించిన కేజీబీవీ విద్యార్థినిని డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, టీచర్లు అభినందించారు.


