Alice: ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్‌ విమానం ఎగిరింది

World First Electric Aircraft Alice Successfully Took Its Maiden Flight - Sakshi

ఎలక్ట్రిక్‌ విమానాల విభాగంలో సంచలనం నమోదైంది. ‘ఆలిస్‌’ అనే తొలి ఎలక్ట్రిక్‌ విమానం గగన వీధుల్లో విహరించింది. కొన్ని నిమిషాల తర్వాత నిర్ధేశించిన ప్రదేశానికి చేరింది. 

ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ విప్లవం జోరందుకుంది. పర్యావరణ పరిరక్షణ, ఖర్చు తగ్గించుకోవడం, మారుతున్న కొనుగోలు దారులు, ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా ఆటోమొబైల్‌ సంస్థలు ఎలక్ట్రిక్‌ కార్లు, బైకులను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఆటోమొబైల్‌ రంగంతో పాటు ఏవియేషన్‌ రంగానికి చెందిన సంస్థలు సైతం ఎలక్ట్రిక్‌ విమానాల్ని తయారు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి.

తాజాగా ఇజ్రాయిల్‌కు చెందిన ఏవియేషన్‌ క్ట్రాఫ్ట్‌ సంస్థ ప్రపంచంలోని తొలి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ‘ఆలిస్’ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ విమానానికి ట్రయల్స్‌ నిర్వహించింది. టెస్ట్‌ రన్‌లో 8 నిమిషాల పాటు ప్రయాణించింది. ఆ తర్వాత అమెరికా, వాషింగ్టన్‌లోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (MWH)లో సక్సెస్‌ ఫుల్‌గా ల్యాండ్‌ అవ్వడంపై ఏవియేషన్‌ రంగానికి చెందిన నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఆలిస్‌ ప్రత్యేకతలు
ఎలక్ట్రిక్‌ విమానం ఆలిస్‌లో 9 మంది ప్రయాణించవచ్చు. కనిష్ట వేగం 260 kats (Knots True Airspeed) తో గంటకు 480 కేఎంపీఎహెచ్‌ వేగాన్ని చేరుకోగలదు. ఇది 250 నాటికల్ మైళ్ళు (400 కి.మీ) వరకు పరిధిని కలిగి ఉండి..సుమారు రెండు గంటల వరకు గాలిలో ఉండగలదు. ఈ విమానం గరిష్టంగా 2,500 పౌండ్ల (సుమారు 1,100 కిలోలు) పేలోడ్ తో ఎగరగలదు.

కాస్త భిన్నంగా
సాధారణ విమానాల కంటే ఆలిస్‌ను భిన్నంగా తయారు చేశారు. విమానం ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే ప్రొపెల్లర్స్ ఇందులో మూడు ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెండు, చెరో రెక్కకు అమరి, విమానం ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి.

ఇదో చరిత్ర
ఈ సందర్భంగా ఏవియేషన్‌ ఎయిర్‌ క్ట్రాఫ్ట్‌ ప్రెసిండెంట్‌, సీఈవో గ్రెగరీ డేవిస్‌ మాట్లాడుతూ.. ఏవియేషన్‌ రంగంలోనే ఇదొక హిస్టరీ. మేం పిస్టన్ ఇంజిన్ నుండి టర్బైన్ ఇంజిన్ కు వెళ్ళినప్పటి నుండి విమానంలో ప్రొపల్షన్ టెక్నాలజీ మార్పును చూడలేదు. 1950వ దశకంలో ఇలాంటి కొత్త టెక్నాలజీని మీరు చివరిసారిగా చూశారు' అని పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top