వ్యాపారాల్లో మహారాణులు: మష్‌రూమ్‌ పౌడర్‌తో థైరాయిడ్‌కి చెక్‌

Women entrepreneurs aim big at Vyapar 2022 - Sakshi

చిన్న సంస్థలతో పెద్ద మార్కెట్‌ 

కేరళ మహిళావేత్తల వ్యాపార ప్రస్థానం

కోచి: వ్యాపారంలో వారికంటూ ఓ చోటు కల్పించుకున్నారు. తమదైన ‘బ్రాండ్‌’ను సృష్టించుకోవడమే కాదు.. మార్కెట్‌ అవకాశాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. ప్రగతి దిశగా సాగిపోతున్న ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు వారంతా. కోచిలో ఏర్పాటు చేసిన ‘వ్యాపార్‌ 2022’ పారిశ్రామిక ఎగ్జిబిషన్‌లో వీరు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.

300 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తే.. అందులో 65 మంది మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైనవి. వీరిని పలుకరించగా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, వ్యాపారంలో గొప్ప దార్శనికత, లక్ష్యం దిశగా వారికి ఉన్న స్పష్టత, ఆకాంక్ష వ్యక్తమైంది. చేతితో చేసిన ఉత్పత్తులు, ఆహారోత్పత్తులు ఇలా ఎన్నింటినో వారు ప్రదర్శనకు ఉంచారు. వీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలకు అందించడమే కాదు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ తమకంటూ స్థానాన్ని సంపాదించుకున్నారు.

► సహజసిద్ధ రీతిలో పుట్టగొడుగులు (మష్‌రూమ్స్‌) సాగు చేస్తూ వాటిని అందరిలా కేవలం మార్కెట్లో విక్రయించడానికి ‘నహోమి’ బ్రాండ్‌ పరిమితం కాలేదు. విలువ ఆధారిత ఉత్పత్తులను రూపొందించి కొత్త మార్కెట్‌ను సృష్టించుకుంది. ఓయెస్టర్‌ మష్‌రూమ్‌ పౌడర్, ఆయిల్, చాక్లెట్, సోప్, పచ్చళ్లు, కేక్‌ ఇలా భిన్న ఉత్పత్తులతో కస్టమర్ల ఆదరణ చూరగొంటోంది.

‘‘ఒయెస్టర్‌ మష్‌రూమ్‌ పౌడర్‌ థైరాయిడ్‌ నయం చేయడంలో మంచి ఫలితాన్నిస్తోంది. విక్రయం కాకుండా మిగిలిన మష్‌రూమ్‌లను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుస్తాం. పెద్ద విక్రయ సదస్సుల్లో వాటిని విక్రయిస్తుంటాం’’అని నహోమి వ్యవస్థాపకురాలు మినిమోల్‌ మ్యాథ్యూ తెలిపారు. కేరళలోని తిరువనంతపురం సమీపంలో వితుర ప్రాంతానికి చెందిన ఆమె దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ వ్యాపార మేళాల్లో ఆమె పాల్గొంటుంటారు.  

► కేరళలోని కలపెట్టా ప్రాంతానికి చెందిన గీత.. ‘వెస్ట్‌ మౌంట్‌ కేఫ్‌’ పేరుతో వ్యాపార వెంచర్‌ ప్రారంభించి.. నాణ్యమైన కాఫీ రుచులను ‘అరబికా కాఫీ’ బ్రాండ్‌పై ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకు, దుబాయి మార్కెట్‌కు అందిస్తున్నారు. అరబికా కాఫీ ప్రీమియం        బ్రాండ్‌. సంపన్న రెస్టారెంట్లు, బ్రాండెడ్‌ సూపర్‌ మార్కెట్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది.  

► తలగడలు, పరుపులు తయారు చేసే ‘విఫ్లవర్స్‌’ ఆవిష్కర్త అరుణాక్షి కాసర్‌గఢ్‌కు చెందిన మహిళ. కరోనా సమయంలో ఏర్పాటైంది ఈ సంస్థ. గతేడాది రూ.50 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశారు. ‘‘నేను 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అందరూ మహిళలే. కర్ణాటక, కేరళ మా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి’’అని అరుణాక్షి తెలిపారు.

► శాఖాహార, మాంసాహార పచ్చళ్లకు ప్రసిద్ధి చెందిన ‘టేస్ట్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌’ అధినేత సుమారేజి పతనం తిట్టకు చెందిన వారు. 25 రకాల పచ్చళ్లను ఆమె మార్కెట్‌ చేస్తున్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్‌లు కలపకుండా సహజ విధానంలో పచ్చళ్లు తయారు చేసి విక్రయించడం టేస్ట్‌ ఆఫ్‌ ట్రావెన్‌ కోర్‌ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వల్లే లులూ గ్రూపు హైపర్‌మార్కెట్లో తమ ఉత్పత్తులకు చోటు దక్కిందంటారు ఆమె. వ్యాపార సదస్సు 2022 ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు ఎన్నో పలకరిస్తున్నట్టు ఆమె చెప్పారు.  

► ఇంజనీరింగ్‌ చదివిన వందనా జుబిన్‌ ఏదో ఒక మంచి ఉద్యోగానికి అతుక్కుపోలేదు. ‘మినీఎం’ పేరుతో చాక్లెట్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు చాక్లెట్లను నచ్చని వారు ఉండరు. చాక్లెట్‌లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి. అలాగే, చక్కెర రూపంలో కీడు కూడా ఉంది. జుబిన్‌ ఆ చక్కెరను వేరు చేశారు. చక్కెర రహిత చాక్లెట్లతో ఎక్కువ మందిని చేరుకుంటున్నారు. షుగర్‌ బదులు తీపినిచ్చే స్టీవియాను ఆమె వినియోగిస్తున్నారు. 25 రకాల చాక్లెట్లను ఆమె మార్కెట్‌ చేస్తున్నారు. పెద్ద ఈ కామర్స్‌ సంస్థలతో టైఅప్‌ చేసుకుని ఎక్కువ మందిని చేరుకోవడమే తన లక్ష్యమని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top