విప్రో భారీ ఆఫర్: రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్ | Wipro unveils Rs 15000 crore buyback via tender route | Sakshi
Sakshi News home page

విప్రో భారీ ఆఫర్: రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్

Apr 16 2026 8:18 PM | Updated on Apr 16 2026 8:31 PM

Wipro unveils Rs 15000 crore buyback via tender route

ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో తన వాటాదారులకు తీపి కబురు అందించింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY26) ఫలితాల సందర్భంగా ఏకంగా రూ. 15,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.

బైబ్యాక్ ముఖ్యాంశాలు
విప్రో బైబ్యాక్ చేసే షేర్ల మొత్తం విలువ రూ. 15,000 కోట్లు. బైబ్యాక్ ధర ఒక్కో షేరుకు  రూ. 250. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 210.15 తో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మొత్తం 60 కోట్ల షేర్లను (మొత్తం ఈక్విటీలో 5.7 శాతం) కంపెనీ వెనక్కి తీసుకోనుంది. 'టెండర్ ఆఫర్' మార్గంలో దామాషా పద్ధతిలో ఈ బైబ్యాక్ ప్రక్రియ జరగనుంది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగిన వారు, ఏడీఆర్ (ADR) హోల్డర్లు ఇందులో పాల్గొనవచ్చు.

క్యూ4 ఫలితాలు
మార్చి 2026తో ముగిసిన త్రైమాసికంలో విప్రో ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,569.6 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 1.89 శాతం తగ్గి రూ. 3,501.8 కోట్లుగా నమోదైంది. మరోవైపు కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ. 24,236.3 కోట్లకు చేరింది.  2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 13,197.4 కోట్ల నికర లాభాన్ని, రూ. 92,624 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

ఏఐ దిశగా అడుగులు
ఫలితాల సందర్భంగా విప్రో సీఈఓ, ఎండీ శ్రీని పల్లియా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న మార్పులు క్లయింట్ల ప్రాధాన్యతలను మారుస్తున్నాయని తెలిపారు. ‘మేము 'ఏఐ-ఫస్ట్' వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. మా ఏఐ నేటివ్ బిజినెస్ యూనిట్ ద్వారా 'సర్వీసెస్-యాజ్-ఎ-సాఫ్ట్వేర్' మోడల్‌కు పెద్దపీట వేస్తున్నాం. ఓలం గ్రూప్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం మా భవిష్యత్తు పెట్టుబడులకు నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు.

  • గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి విప్రో షేరు ధర స్వల్పంగా పెరిగి రూ. 210.20 వద్ద స్థిరపడింది. 

Advertisement
 
Advertisement
Advertisement