క్యూ2లో రూ. 3,201 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ రంగ దేశీ దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై– సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 1 శాతం పైగా నీరసించి రూ. 3,201 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2025–26) ఇదే కాలంలో రూ. 3,246 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 9% ఎగసి రూ. 24,753 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 22,697 కోట్ల టర్నోవర్ అందుకుంది.
త్రైమాసికవారీగా(ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే) నికర లాభం 4.5% క్షీణించగా.. ఆదాయం 1% బలపడింది. ఐటీ సర్వీసుల ఆదాయం నామమాత్ర వృద్ధితో 261.15 కోట్ల డాలర్లను తాకింది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో ఈ విభాగం ఆదాయం 257.1–262.5 కోట్ల డాలర్లు ఉండొచ్చని కంపెనీ తాజాగా అంచనా వేసింది. స్థిర కరెన్సీలో చూస్తే త్రైమాసికవారీగా ఇది –1.5% నుంచి +0.5 శాతానికి సమానం. ఈ కాలంలో మొత్తం డీల్స్ 23 శాతం ఎగసి రూ. 259.5 కోట్ల డాలర్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. 6,716 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,36,328కు చేరింది.
పెట్టుబడి ఫలితాలు
వ్యూహాత్మకంగా చేపట్టిన పెట్టుబడులు ఫలితాలనివ్వడం ప్రారంభించినట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. కొత్త క్లయింట్లు, మార్కెట్లను గెలుపొందేందుకు తమ సామర్థ్యాలను ఇవి మెరుగుపరుస్తున్నట్లు తెలియజేశారు. ఏఐ దీర్ఘకాలిక వృద్ధి చోదకంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 1,000 మంది ఫ్రెషర్స్ను నియమించుకున్నట్లు వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు 1.6% బలపడి రూ. 174 వద్ద ముగిసింది.


