7,500 జాబ్స్‌.. ఐటీ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌ | Wipro Hiring 2026 Reaffirms 7500 Fresher Jobs Campus Recruitment H2 | Sakshi
Sakshi News home page

7,500 జాబ్స్‌.. ఐటీ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌

Oct 16 2026 4:34 PM | Updated on Oct 16 2026 5:34 PM

Wipro Hiring 2026 Reaffirms 7500 Fresher Jobs Campus Recruitment H2

ఐటీ సేవల సంస్థ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో క్యాంపస్‌ నియామకాలను పెంచాలని యోచిస్తోంది. ఏటా 7,500 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలనే దీర్ఘకాలిక లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సౌరభ్‌ గోవిల్‌ తెలిపారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామకాల సంఖ్య లక్ష్యం కంటే కొంత తక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు.

మొదటి ఆరు నెలల్లో ఇప్పటికే ఉన్న బెంచ్‌ ఉద్యోగుల సంఖ్య ఆరోగ్యకరంగా ఉండటంతో క్యాంపస్‌ నియామకాలపై విప్రో ఎక్కువగా దృష్టి పెట్టలేదు. ఈ కాలంలో సుమారు 1,000 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకుంది. రెండో అర్ధభాగంలో నియామకాలు గణనీయంగా పెరుగుతాయని గోవిల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, ఆలస్యమైన ఒప్పందాలు ఖరారై కొత్త బుకింగ్స్‌ పెరుగుతాయని కంపెనీ యాజమాన్యం అంచనా వేస్తోంది.

కాగా విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. వార్షికంగా జూలై– సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం 1 శాతం పైగా నీరసించి రూ. 3,201 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2025–26) ఇదే కాలంలో రూ. 3,246 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 9% ఎగసి రూ. 24,753 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 22,697 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. త్రైమాసికవారీగా(ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే) నికర లాభం 4.5% క్షీణించగా.. ఆదాయం 1% బలపడింది.

ఇదీ చదవండి: టాటా టెక్నాలజీస్‌.. లాభం ప్లస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement