ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఈ సమయంలో బంగారం, వెండి వంటి లోహాలకు విలువ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం.. గోల్డ్, సిల్వర్ రేటు దీనికి విరుద్ధంగా ఉంది.
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్నా సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం.. డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా.. బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.
వారం రోజుల్లో రూ.13 వేలు డౌన్!
బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.
బంగారం ధరలు తగ్గుతాయా?
బంగారం ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల మాదిరిగానే.. ధరలు తగ్గితే, గోల్డ్ రేటు పతనమవుతుందని చెప్పవచ్చు. కానీ కియోసాకి వంటి నిపుణులు బంగారం ధర పెరుగుతుందనే చెబుతున్నారు.


