వాట్సాప్‌ యూజర్‌ నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం నజర్ | WhatsApp Username Feature Faces Indian Govt Scrutiny Meta Officials Meet MeitY | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ యూజర్‌ నేమ్‌ ఫీచర్‌పై కేంద్రం నజర్

Jul 4 2026 12:15 PM | Updated on Jul 4 2026 12:30 PM

WhatsApp Username Feature Faces Indian Govt Scrutiny Meta Officials Meet MeitY

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ప్రతిపాదిత ‘యూజర్ నేమ్’ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం, మెటా సంస్థల మధ్య చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ సరికొత్త ఫీచర్‌పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) వివరణ కోరిన నేపథ్యంలో, మెటా ప్రతినిధులు శుక్రవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ భేటీలో ప్రభుత్వ అధికారులు తమకున్న పలు ఆందోళనలను మెటా బృందం ముందు ఉంచారు. అలాగే, గతంలో ఆదేశించినట్లుగానే మూడు రోజుల్లోగా దీనిపై సమగ్రమైన, వివరణాత్మక ప్రతిస్పందనను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా కంపెనీ తన అధికారిక సమాధానాన్ని అందిస్తుందని నమ్మదగిన వర్గాలు వెల్లడించాయి.

కేంద్రం నోటీసులు.. నిలిచిపోయిన రోల్‌అవుట్

ఈ వారం ప్రారంభంలోనే వాట్సాప్‌లో యూజర్ నేమ్‌ల రోల్ అవుట్ ప్రక్రియపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పూర్తిస్థాయి చర్చలు ముగిసి అన్ని అనుమానాలు నివృత్తి అయ్యే వరకు ఈ ఫీచర్‌ను భారతదేశంలో విడుదల చేయవద్దని కేంద్రం కంపెనీని కరాఖండిగా ఆదేశించింది. ప్రధానంగా సైబర్ భద్రత, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ ఆన్‌లైన్ మోసాలకు, గోప్యతా ఉల్లంఘనలకు దారితీసే అవకాశం ఉందని పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఏంటి ఈ యూజర్ నేమ్ ఫీచర్?

వినియోగదారుల పేర్లు ‘@’ చిహ్నంతో ప్రారంభమయ్యే ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌గా ఉంటాయి. ఇది పూర్తిగా ఐచ్ఛికం (ఆప్షనల్‌). ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ వ్యక్తిగత మొబైల్ నంబర్లను ఇతరులతో షేర్ చేయకుండానే మెసేజ్‌లు లేదా కాల్స్ రిసీవ్ చేసుకోగలుగుతారు. యూజర్ ప్రొఫైల్స్‌లో కనిపించే సాధారణ డిస్ ప్లే పేర్ల కంటే ఈ ‘యూజర్ నేమ్‌’లు భిన్నంగా ఉంటాయి. డిస్ ప్లే పేర్లు ప్రత్యేకంగా ఉండాల్సిన పనిలేదు, కానీ యూజర్ నేమ్స్ మాత్రం ఒక్కొక్కరికి యూనిక్‌గా ఉంటాయి. మీ ఫోన్ నంబర్ సేవ్ చేయని వ్యక్తులకు డైరెక్ట్ మెసేజ్‌లు, కాల్స్, గ్రూప్ చాట్లలో డిఫాల్ట్‌గా మీ ‘యూజర్ నేమ్’ మాత్రమే కనిపిస్తుంది.

ఇతరులు దుర్వినియోగం చేయకుండా లేదా క్లెయిమ్ చేయకుండా ఉండటానికి.. కొన్ని నిర్దిష్ట వినియోగదారు పేర్లను వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రముఖులకు మెటా ముందే కొన్ని యూజర్‌ నేమ్‌లను కేటాయించనుంది.

నిపుణుల ఆందోళన

మెటా సంస్థ ఎన్ని రక్షణ చర్యలు చెప్తున్నప్పటికీ సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మోసగాళ్లు ప్రముఖ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు లేదా ప్రభుత్వ విభాగాలను పోలి ఉండేలా నకిలీ యూజర్ నేమ్స్ సృష్టించే ప్రమాదం ఉంది. దీనివల్ల సాధారణ ప్రజలు సులభంగా మోసపోయే అవకాశం ఉంది’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటీసుకు మెటా ఇచ్చే సమాధానం, ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపుల ఫలితం ఆధారంగానే.. భారతదేశంలో ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ అసలు ప్రారంభమవుతుందా లేదా? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది? అనేది తేలనుంది.

ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement