ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..? | Sakshi
Sakshi News home page

ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..?

Published Tue, Oct 19 2021 8:06 PM

What happens if you fail to repay your home loan - Sakshi

ప్రజలు సాధారణంగా తమ కలల గృహాన్ని కొనుగోలు చేయడం కోసం గృహ రుణం(Home Loan) తీసుకుంటారు. గృహ రుణాలు ఎక్కువగా దీర్ఘకాలం వరకు ఉంటాయి. అయితే గృహరుణం తీసుకున్న తర్వాత కొందరు ఉపాధి కోల్పోవడం, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రుణ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది.  ఇలా మనం గృహ రుణాల ఈఎమ్ఐ చెల్లించకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. అవేంటో తెలుసుకుందాం..

క్రెడిట్ స్కోరుపై ప్రభావం
మీరు గనుక హోమ్ లోన్ ఈఎమ్ఐ కట్టకపోతే ఆలస్య ఫీజులు కింద జరిమానాలు విధిస్తారు. ఈ పెనాల్టీ ఛార్జ్ సాధారణంగా ఈఎమ్ఐలో 1-2% వరకు ఉంటుంది. అయితే, పరిస్థితిని బట్టి, కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ కాలానికి మొత్తం బకాయి మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణదాత వసూలు చేసే ఆలస్య ఫీజులకు ఇది అదనంగా ఉంటుంది. ఒక్క ఈఎమ్ఐ పేమెంట్ కట్టకపోయిన అది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. మీ ఇంటి రుణంపై సింగిల్ డిఫాల్ట్ వల్ల మీ క్రెడిట్ స్కోరు 50-70 పాయింట్ల వరకు తగ్గవచ్చు. అటువంటి పరిస్థితి వల్ల తర్వాత ఏదైనా లోన్ పొందే అవకాశం కోల్పోతారు.(చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త కంపెనీలు)

నిరర్ధక ఆస్తిగా లోన్
అయితే, ఒకవేళ మీరు ఈఎమ్ఐని మిస్ అయినట్లయితే చివరి పేమెంట్ చేసిన 90 రోజుల్లోగా కట్టాల్సి ఉంటుంది. ఇది చిన్న డిఫాల్ట్ గా వర్గీకరిస్తారు. మీరు సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లయితే దాని ప్రభావం నుంచి మీరు కోలుకోవచ్చు. మిస్ అయిన ఈఎమ్ఐని తర్వాత గడువు తేదీనాటి నుంచి చెల్లించండి. అలాగే, మిగతా ఈఎమ్ఐలను మిస్ కాకుండా చూసుకోండి. ఉద్యోగ నష్టం/ ఆరోగ్య పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే రుణదాతను సంప్రదించండి. వారిని ఏదైనా పరిష్కారం చెప్పమనండి. మీ రుణం నిరర్ధక ఆస్తి(ఎన్‌పిఎ)గా మారడానికి ముందు మీ బకాయిలను చెల్లించడానికి మీకు 90 రోజుల గడువు ఉంది. 

ఒకవేళ మీరు 90 రోజుల తర్వాత కూడా మీ ఈఎమ్ఐ బకాయిలను తిరిగి చెల్లించలేకపోతే SARFAESI 2002 చట్టం ప్రకారం.. మీ ఆస్తిని వేలం వేసే హక్కు రుణదాతకు లభిస్తుంది. కాబట్టి, అలా౦టి పరిస్థితుల నుంచి తప్పి౦చుకోవడానికి ము౦దుగానే చర్యలు తీసుకో౦డి. గృహ రుణ ఎగవేత నుంచి తప్పించుకోవడం కోసం మీరు మీ రుణదాతను తక్కువ ఈఎమ్ఐ కోసం అభ్యర్థించవచ్చు.ఒకవేళ మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయిన/మీ వ్యాపార కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లయితే ఈఎమ్ఐ చెల్లింపులపై బ్యాంకులు మీకు మూడు నుంచి ఆరు నెలల మాఫీని ఇవ్వవచ్చు. అయితే, రుణదాత తర్వాత ఈ కాలానికి బకాయి రుణ మొత్తంపై వడ్డీని వసూలు చేయవచ్చు. 
(చదవండి: రిలయన్స్‌ జియో సరికొత్త రికార్డు..!)

ఆస్తిపై హక్కులు చేజారిపోతాయి
మీరు ఇక రుణం చెల్లించని పక్షంలో మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు, ఇతర సంస్థలు గానీ ఇంటి వాస్తవ విలువను అంచనా వేసి తర్వాత వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. ఒకవేళ వేలంలో పేర్కొన్న విలువ వాస్తవ విలువ కంటే తక్కువ అని యజమాని భావిస్తే ఆ సంస్థలను సంప్రదించవచ్చు. ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంత వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకున్న తర్వాత అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని మీకు పంపిస్తుంది.

మరో మార్గం
ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు మరో మార్గం ఉంటుంది. బ్యాంక్/రుణం తీసుకున్న సంస్థ వేలం వేయడానికి ముందే మీరు ఆ ఇంటిని విక్రయించండి. ఎందుకంటే, రుణదాతలు ఎక్కువ సార్లు మార్కెట్ విలువ కంటే తక్కువకు ఆ ఇంటిని విక్రయిస్తాయి. దీని వల్ల మీరు మరింత నష్టపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఆ ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఈఎమ్ఐని ఒకేసారి క్లియర్ చేయండి. దీని వల్ల మీరు కొంత లాభపడే అవకాశం ఉంది. మీకు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి గృహ రుణం తీసుకునే ముందు మీ ఆదాయంలో 40% ఈఎమ్ఐ చెల్లింపులు ఉండే విధంగా చూసుకోండి.
(చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో వారి దశ తిరిగింది)

Advertisement
Advertisement