పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసులో అంతరాయాలు భారత్ వంటి భారీ వినియోగ క్రూడ్ దేశాలకు హెచ్చరిక లాంటిది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలవాల్సిన వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు భారత్‌లో ఏ స్థాయిలో ఉన్నాయి? మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వ్యూహాత్మక నిల్వలు ఎందుకు కీలకం?
ఇంధన నిల్వలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వం నిర్వహించే వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు నిర్వహించే వాణిజ్య నిల్వలు. వీటి ప్రాముఖ్యత ఆర్థిక పరంగానే కాకుండా దేశ రక్షణకు కూడా సంబంధించింది కావడం గమనార్హం.
భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరంతర ఇంధన సరఫరాకు ఇవి అండగా నిలుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఈ నిల్వలు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. ఇంధనాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే దేశాల ముందు భారత్ తలవంచకుండా ఉండేందుకు ఈ బఫర్ స్టాక్ రక్షణ కవచంగా పనిచేస్తుంది.
ఆందోళనకరంగా ఎల్‌పీజీ నిల్వలు
భారత్ వంటగ్యాస్ పంపిణీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ, నిల్వ సామర్థ్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉంది. విశాఖపట్నం కేవర్న్(హెచ్‌పీసీఎల్, టోటల్‌ఎనర్జీస్ జేవీ) సామర్థ్యం 60,000 టన్నులు, మంగళూరు కేవర్న్(హెచ్‌పీసీఎల్) 80,000 టన్నులతో మొత్తం సామర్థ్యం 1,40,000 టన్నులుగా ఉంది.
దేశవ్యాప్తంగా రోజువారీ ఎల్‌పీజీ డిమాండ్ సుమారు 90,000 టన్నులు అని అంచనా. అంటే మన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వలు కనీసం రెండు రోజులకు కూడా సరిపోవు. ప్రస్తుతం మన మౌలిక సదుపాయాలన్నీ గ్యాస్‌ను పోర్టుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరవేసే ‘ఆపరేషనల్ ఫ్లో’ మోడల్‌లోనే ఉన్నాయి తప్ప దీర్ఘకాలిక నిల్వ కోసం ఉద్దేశించినవి కావని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఎందుకీ పరిస్థితి?
ముడి చమురు నిల్వల విషయంలో భారత్ ఇప్పటికే భారీ వ్యూహాత్మక నిల్వలను నిర్మించుకుంది. కానీ గ్యాస్ విషయంలో మాత్రం ఆ పురోగతి కనిపించలేదు. దీనికి కొన్ని కారణాలున్నాయి.
గతంలో గ్యాస్ సరఫరా సులభంగా, తక్కువ ధరకే లభించడంతో నిల్వల కంటే సరఫరా వ్యవస్థపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.
గ్యాస్‌ను భూగర్భంలో నిల్వ చేయడానికి తగిన సహజ కేవర్లు గుర్తించడం సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రక్రియ.
గ్యాస్ స్టోరేజ్ టెర్మినల్స్ నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది.
కొత్త వ్యూహం: ప్రభుత్వం ఏం చేస్తోంది?
పశ్చిమాసియా సంక్షోభం తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ భద్రతపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వ్యూహాత్మక గ్యాస్ నిల్వల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు పెట్రోలియం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎల్‌ఎన్‌జీ/ఎల్‌పీజీ టెర్మినల్స్‌లో అదనంగా 10 శాతం నిల్వ సామర్థ్యాన్ని తప్పనిసరి చేసే నిబంధనను సమీక్షిస్తున్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఆరు కొత్త ప్రాంతాల్లో నిల్వ కేంద్రాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతంలో ఉన్న ‘సాల్ట్ కేవర్లు’ గ్యాస్ నిల్వకు అత్యంత అనువైనవిగా భావిస్తున్నారు.
అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోవాలంటే భారత్ కేవలం సరఫరాపైనే కాకుండా నిల్వపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. విధానపరమైన వేగం, సాంకేతిక తోడ్పాటు తోడైతేనే ఇంధన భద్రతలో భారత్ స్వయంసమృద్ధి సాధించగలదు.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


