నష్టాల్లోనే వొడాఫోన్‌ ఐడియా

Vodafone Idea Q1 loss marginally narrows to Rs 7297 cr - Sakshi

క్యూ1లో రూ. 7,297 కోట్లు

రూ. 128కు ఏఆర్‌పీయూ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్‌ సేవల కంపెనీ వొడాఫోన్‌ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ. 7,297 కోట్లకు చేరాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,319 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 10,410 కోట్లను తాకింది.

ప్రస్తుత సమీక్షా కాలంలో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 104 నుంచి రూ. 128కు మెరుగుపడింది. టారిఫ్‌ల పెంపు ఇందుకు సహకరించింది. మార్చి నుంచి జూన్‌కల్లా మొత్తం వినియోగదారుల సంఖ్య 24.38 కోట్ల నుంచి 24.04 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే 10 లక్షల మంది 4జీ కస్టమర్లు జత కలవడంతో వీరి సంఖ్య 11.9 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.

కొత్త చైర్మన్‌..
ఈ నెల(ఆగస్ట్‌) 19 నుంచి చైర్మన్‌గా రవీందర్‌ టక్కర్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఈ నెల 18కల్లా హిమాన్షు కపానియా నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నట్లు తెలియజేసింది. వొడాఫోన్‌ గ్రూప్‌ నామినీ అయిన టక్కర్‌ ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టెలికం పరిశ్రమలో మూడు దశాబ్దాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కీలక మార్కెట్లలో 5జీ సేవలను అందించేందుకు తగిన స్పెక్ట్రమ్‌ను తాజాగా సొంతం చేసుకున్నట్లు సీఈవో టక్కర్‌ వెల్లడించారు.  

ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 9.10 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top