
ప్రముఖ బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పక్కా బిజినెస్‌మ్యాన్‌గా మారిపోయారు. సినీ పరిశ్రమపై తనకు విరక్తి పెరిగిందని, అందుకే తన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టానని ఆయన చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ నటుడు ఇప్పుడు తన ప్రధాన జీవనాధారాన్ని పూర్తిగా బిజినెస్ వైపు మళ్లించారు.
తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 కంపెనీలకు ఒక్క ఏడాదిలోనే 1 బిలియన్ డాలర్లు (రూ.8,500 కోట్లు) సమీకరించినట్లు తెలిపారు. వీటిలో రెండు కంపెనీలు ఐపీవోకి కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని వివేక్ ఓ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నెట్‌వర్త్ రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా.
భూమి మొదటి వ్యాపారం
ఇటీవల సీఎన్‌బీసీ టీవీ-18 ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్ తన వ్యాపార సంగతులను పంచుకున్నారు. తన తండ్రి సురేష్ ఒబెరాయ్ వ్యాపారవేత్త కావడంతో తాను కూడా చిన్న వయసు నుంచే వ్యాపారం వైపు మొగ్గు చూపానని చెప్పారు. ‘ఇన్వెస్టర్ అయిన ఆయన (తండ్రి) ఎప్పుడూ భూములు కూడబెడుతూ కొనడం, అమ్మడం చేసేవారు. అలా డబ్బు సంపాదించేవారు. భూమి నాకు పరిచయమైన మొదటి వ్యాపారం. నాకు తొమ్మిది పదేళ్ల వయసున్నప్పుడు అకస్మాత్తుగా ఇన్వెంటరీతో వచ్చేవాడు. ఒక సంవత్సరం పెర్ ఫ్యూమ్స్, మరో ఏడాది ఎలక్ట్రానిక్స్... వాటిని నా బ్యాక్ ప్యాక్ లో నింపుకుని ఇంటింటికీ వెళ్లేవాన్ని. చివరిలో నా 'లెక్కలు' అడుగేవారు. లాభం మాత్రం నాకిచ్చి మిగిలింది తీసుకునేవారు' అని వివేక్ గుర్తు చేసుకున్నారు.
సినిమాల్లో లోపించిందదే..
కొన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో గడిపిన వికేక్ ఒబెరాయ్ ఇంకా తాను మొదలుపెట్టిన చోటే ఉన్నానని గ్రహించారు. "అది (సినీ పరిశ్రమలో ఉండటం) నాకు నచ్చలేదు. అది ఎదుగుదల కాదు. నేను అక్కడ ఉండటం, కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ ఇది ఎదుగుదలకు తోడ్పడాలి. ఎవరైనా ప్రతిభ ఉన్నవారిని దగ్గరకు తీసి వారి ఎదుగుదలకు సహకారం అందించాలి. అక్కడ లోపించిందదే" అని చెప్పుకొచ్చిన వివేక్ నిరాశగా తల కొట్టుకుంటూ అక్కడే ఉండటం కన్నా వ్యాపారం వైపు రావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
పెట్టుబడుల విషయంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులకూ తాను వెనుకాడనని చెప్పిన వికేక్ ఒబెరాయ్.. ‘గత ఏడాదిలోనే నా కంపెనీలకు 1 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించగలిగాం. ఇది గణనీయమైన మొత్తం. అయినా అదేం సమస్య కాదు. అయితే ఆ నిధులను ఎక్కడ పెట్టాలి.. ఎలా ఆ వృద్ధి చేయాలన్నది తెలియాలి. అందుకు మార్వాడీ మనస్తత్వం అలవర్చుకోవాలి" అంటూ సూచించారు. బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు అంతర్జాతీయ చిత్రాలను 'కాపీ' చేసినా వాటికి 'దేశీ మసాలా' తగిలిస్తున్నామంటూ చెబుతుంటారు. "మరి దీన్ని వ్యాపారంలో ఎందుకు చేయకూడదు?" అంటూ ప్రశ్నిస్తున్నారు.