క్యూ4లో వేదాంత దూకుడు

Vedanta to pay Rs 117. 1 billion in dividends as Q4 profit drops - Sakshi

రూ. 7,570 కోట్లకు నికర లాభం 

షేరుకి రూ. 31.5 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ మైనింగ్‌ దిగ్గజం వేదాంత లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,500 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 5,105 కోట్ల లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాల పరిమాణం, కమోడిటీల ధరలు, నిర్వహణా సామర్థ్యం సహకరించాయి. గత త్రైమాసికంలో రూ. 336 కోట్ల అనుకోని పద్దు నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

ప్రధానంగా చమురు, గ్యాస్‌ విభాగంలో రూ. 2,697 కోట్ల ఇంపెయిర్‌మెంట్‌ రివర్సల్‌ ఆర్జనను కెయిర్న్‌ ఇంధన వెలికితీత వ్యయాల రైటాఫ్‌ కొంతమేర ప్రభావితం చేసినట్లు వివరించింది. వాటాదారులకు షేరుకి రూ. 31.5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇందుకు మే 9 రికార్డ్‌ డేట్‌కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 27,874 కోట్ల నుంచి రూ. 39,342 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో వ్యయాలు రూ. 22,549 కోట్ల నుంచి రూ. 29,901 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 51 శాతం వృద్ధితో రూ. 13,768 కోట్ల నిర్వహణా లాభం(ఇబిటా) సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేసింది.

పటిష్ట క్యాష్‌ ఫ్లో  
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వేదాంత నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 24,299 కోట్లను తాకింది. 2020–21లో రూ. 12,446 కోట్లు ఆర్జించింది. గతేడాది అత్యుత్తమ నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 45,319 కోట్లు ఆర్జించింది. ఇక అనుకోని పద్దులు, పన్ను ఆర్జనకు ముందు నికర లాభం రూ. 24,299 కోట్లకు చేరింది. అమ్మకాల పరిమాణం, నిర్వహణా సామర్థ్యం, వ్యవస్థాగత ఇంటిగ్రేషన్, టెక్నాలజీ వినియోగం తదితరాలపై తాము పెట్టిన ప్రత్యేక దృష్టికి తాజా ఫలితాలు నిదర్శనమని వేదాంత సీఈవో సునీల్‌ దుగ్గల్‌ పేర్కొన్నారు. వెరసి రూ. 27,154 కోట్ల ఫ్రీ క్యాష్‌ ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. తద్వారా వృద్ధి అవకాశాలపై తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం, బ్యాలెన్స్‌ షీట్‌ను మరింత పటిష్టపరచుకోవడం, వాటాదారులకు అధిక డివిడెండ్ల చెల్లింపు వంటివి చేపట్టేందుకు మరింత వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.  
ఫలితాల నేపథ్యంలో వేదాంత షేరు ఎన్‌ఎస్‌ఈలో నామమాత్ర నష్టంతో రూ. 411 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top