మళ్లీ యూఎస్‌ మార్కెట్లు.. బేర్‌ బేర్‌

US Markets tumbles due to  huge selloff in FAANG shares - Sakshi

టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాల ఎఫెక్ట్‌

డోజోన్స్‌ 632 పాయింట్లు పతనం

465 పాయింట్లు పడిపోయిన నాస్‌డాక్‌

3 రోజుల్లో 10 శాతం దిగజారిన నాస్‌డాక్‌

21 శాతం కుప్పకూలిన టెస్లా ఇంక్‌ 

మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ బోర్లా

వరుసగా మూడో రోజు మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్‌ 633 పాయింట్లు(2.25%) పతనమై   27,500 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 95 పాయింట్లు(2.78%) దిగజారి 3,332 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 465 పాయింట్లు(4.11%) పడిపోయి 10,848 వద్ద స్థిరపడింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 10 శాతం కోల్పోయింది. ఇది దిద్దుబాటు(కరెక్షన్‌)కు సంకేతమని సాంకేతిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్‌-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్‌ కుదుర్చుకోకుండానే యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్‌) అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలరు ఇండెక్స్‌ నాలుగు వారాల గరిష్టానికి చేరగా.. ముడిచమురు ధరలు 8 శాతం పడిపోయాయి.

పతన బాటలో
ఫాంగ్‌(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్‌ ఎకానమీ కౌంటర్లలో యాపిల్‌ 7 శాతం పతనమైంది. దీంతో ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్‌ విలువలో 140 బిలియన్‌ డాలర్లు ఆవిరైంది. 2008 అక్టోబర్‌ తదుపరి యాపిల్‌ షేరు 3 రోజుల్లోనే 14 శాతం క్షీణించింది. ఈ బాటలో ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్‌.. తొలిసారి ఒక్క రోజులోనే 21 శాతం కుప్పకూలింది. జనరల్‌ మోటార్స్‌ 2 బిలియన్‌ డాలర్లతో 11 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో టెస్లా ప్రత్యర్థి సంస్థ నికోలా కార్పొరేషన్‌ షేరు 41 శాతం దూసుకెళ్లింది.

ఫాంగ్‌ స్టాక్స్‌  వీక్
టెక్నాలజీ, సోషల్‌ మీడియా, ఈకామర్స్‌ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్‌ 5.4 శాతం, ఫేస్‌బుక్‌ 4 శాతం, అమెజాన్‌ 4.4 శాతం, గూగుల్‌ 3.7 శాతం, నెట్‌ఫ్లిక్స్‌ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ కౌంటర్లలో బిలియన్ల డాలర్లతో పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన అంచనాల కారణంగా సాఫ్ట్‌బ్యాంక్‌ షేరు సైతం 7 శాతం పడిపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top