యూఎస్‌ మార్కెట్ల సరికొత్త రికార్డ్‌

US Markets ends @ record highs- Tesla jumps - Sakshi

డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ దూకుడు

ఫాంగ్‌ స్టాక్స్‌- యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ జోరు

టెస్లా ఇంక్ హైజంప్‌‌- 773 బిలియన్‌ డాలర్లకు విలువ

ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎలన్‌ మస్క్‌ రికార్డ్‌

న్యూయార్క్, సాక్షి‌: యూఎస్‌ కాంగ్రెస్‌లో డెమక్రాట్ల ఆధిపత్యం కారణంగా కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్‌పై అంచనాలు పెరిగాయి. దీంతో కోవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే బాటలో ప్రభుత్వం ఇకపై భారీ సహాయక ప్యాకేజీలకు తెరతీయవచ్చన్న అంచనాలు పెరిగాయి. మరోపక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్‌ను గడువుకంటే ముందే అధికారం నుంచి తప్పించేందుకు చర్యలు మొదలైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి గురువారం యూఎస్‌ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. డోజోన్స్‌ 212 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 31,041 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 56 పాయింట్ల(1.5 శాతం) వృద్ధితో 3,804 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 327 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 13,067 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం!  చదవండి: (మారిన ఐటీ కంపెనీల ఫోకస్‌)

బాండ్ల ఈల్డ్స్‌ అప్‌
10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ 10 నెలల గరిష్టం 1.081 శాతానికి ఎగశాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 0.5 శాతం బలపడి 89.78ను తాకింది. మరోపక్క పసిడి ధరలు ఔన్స్‌ 0.3 శాతం నీరసించి 1914 డాలర్లకు చేరాయి. కాగా.. గత వారం నిరుద్యోగ క్లెయిములు అంచనాలకంటే తగ్గడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్‌ మస్క్‌?)

టెస్లా జోరు
ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్‌ 8 శాతం జంప్‌చేసి 816 డాలర్లను తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 773 బిలియన్‌ డాలర్లను అధిగమించింది. ఫలితంగా కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌ సంపద 188 బిలియన్‌ డాలర్లను తాకింది. టెస్లా ఇంక్‌లో మస్క్‌కు 20 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మస్క్‌ ఆవిర్భవించినట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌, ఇంటర్నెట్‌ దిగ్గజం అ‍ల్ఫాబెట్‌, ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌, ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 3.5-1 శాతం మధ్య జంప్‌చేశాయి. దీంతో ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ భారీగా బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. డీఎక్స్‌సీ టెక్నాలజీ కొనుగోలుకి ఫ్రాన్స్‌ ఐటీ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అటోస్‌ ఎస్‌ఈ 10 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ను ప్రకటించడంతో డిక్సన్‌ షేరు 9 శాతం దూసుకెళ్లింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top