క్యూ3లో యూఎస్‌ జీడీపీ 33 శాతం అప్‌

US Economy jumps 33% in July-September  - Sakshi

క్యూ3(జులై- సెప్టెంబర్‌) గణాంకాల విడుదల

1947 నుంచీ ఇదే రికార్డ్‌- 1950లో 16.7 శాతం వృద్ధి

వచ్చే రెండు క్వార్టర్లలో తిరిగి మైనస్‌లోకి: నిపుణుల అంచనా

వాషింగ్టన్‌: కోవిడ్‌-19 వేధిస్తున్నప్పటికీ యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ క్యూ3(జులై- సెప్టెంబర్‌)లో ఏకంగా 33.1 శాతం పురోగమించింది. వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది(2020) మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ 33.1 శాతం వృద్ధిని సాధించింది. వెరసి తొలుత వేసిన వృద్ధి అంచనాలను ఆర్థిక వ్యవస్థ ఎలాంటి మార్పులు లేకుండా సాధించినట్లయ్యింది. కాగా.. దేశ చరిత్రలోనే ఇది అత్యధికమని ఆర్థికవేత్తలు ఈ సందర్భంగా తెలియజేశారు. 1947 నుంచి గణాంకాలు నమోదు చేయడం ప్రారంభించాక 1950లో మాత్రమే దేశ జీడీపీ ఒక త్రైమాసికంలో అత్యధికంగా 16.7 శాతం పురోగతిని సాధించినట్లు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో పెట్టుబడులు, హౌసింగ్‌, ఎగుమతులు భారీగా పుంజుకున్నప్పటికీ.. స్థానిక ప్రభుత్వాల వినిమయంతోపాటు, వినియోగ వ్యయాలు తగ్గడం, నిల్వలు పెరగడం వంటివి బలహీనపడినట్లు గణాంకాలు వివరించాయి.

మాంద్య పరిస్థితులు
ఈ ఏడాది క్యూ4(అక్టోబర్‌- డిసెంబర్‌)లో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి మైనస్‌లోకి జారుకునే వీలున్నట్లు యూఎస్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. సెకండ్‌వేవ్‌లో భాగంగా తిరిగి కోవిడ్‌-19 కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు వ్యవస్థలకు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా క్యూ4లో ప్రతికూల వృద్ధి నమోదుకావచ్చని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది విశ్లేషకులైతే మహామాంద్యం ముప్పు పొంచిఉన్నట్లు అంచనా వేస్తుండటం గమనార్హం. కాగా.. వార్షిక ప్రాతిపదికన యూఎస్‌ జీడీపీ తొలి క్వార్టర్‌లో 5 శాతం క్షీణించగా.. క్యూ2లో మరింత అధికంగా 31.4 శాతం క్షీణించిన విషయం విదితమే. క్యూ2లో లాక్‌డవున్‌లు, ఉద్యోగాల కోత తదితర అంశాలు ప్రభావం చూపాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టపోయిన ఉత్పాదకతను తిరిగి సాధించడం అంత సులభంకాదని, కోవిడ్‌-19 మరోసారి కల్లోలం సృష్టిస్తుండటంతో వచ్చే ఏడాది(2021) తొలి త్రైమాసికం(జనవరి- మార్చి)లోనూ దేశ జీడీపీ మైనస్‌లోకి జారుకునే అవకాశమున్నదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top