యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అది వాయిదా పడుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా కొత్త ఎండీఆర్ నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమలు కావాల్సి ఉంది. అయితే ఇది జనవరి 1, 2027కి వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తుది అధికారిక ప్రకటన వెలువడలేదని గమనించాలి.
కొత్త విధానం ప్రకారం వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు(పీ2పీ) అన్ని ఉచితంగానే కొనసాగుతాయి. అలాగే వ్యాపారులకు చేసే రూ.2,000 వరకు లావాదేవీలపైనా ఎండీఆర్ ఉండదు. చిన్న వ్యాపారులు నెలకు క్యూఆర్ కోడ్ ద్వారా స్వీకరించే రూ.1 లక్ష వరకు చెల్లింపులకూ జీరో ఎండీఆర్ కొనసాగుతుంది. దీంతో మొత్తం పీర్2మర్చంట్ లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కావని కేంద్రం స్పష్టం చేసింది.
ఛార్జీలు ఇలా..
రూ.2,000కు మించిన నిర్దిష్ట వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు రూ.5 ఫ్లాట్ ఎండీఆర్‌ను ప్రతిపాదించారు. మూలధన మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.
ముఖ్యంగా ఎండీఆర్ వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐకి వెళ్లదు. చెల్లింపుల వ్యవస్థలోని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుంది. వినియోగదారులపై అదనపు భారం పడకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తులం బంగారం కొంటే ఎంత ఖర్చు? నేటి గోల్డ్ రేట్లు!


