
ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించింది. రెసిడెన్సీ వ్యవస్థలోనూ మార్పులు చేసింది. వీటిలో ఏఐ, ఎంటర్‌టైన్మెంట్, ఈవెంట్, క్రూయిజ్ టూరిజం కోసం నాలుగు కొత్త వీసా (New Visa) కేటగిరీలు ఉన్నాయి.
అంతే కాకుండా, వ్యాపార, ట్రక్ డ్రైవర్ వీసాలకు సంబంధించి కూడా మార్పులు చేశారు. మానవతా సహాయం, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, నివాసితుల బంధువులు, స్నేహితులకు కూడా రెసిడెన్సీ అవకాశం కల్పిస్తున్నారు.
నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలు ఇవే..
ఏఐ స్పెషలిస్ట్ వీసా: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోని నిపుణుల కోసం ఉద్దేశించినది. ఇందు కోసం టెక్ ఫోకస్డ్ కంపెనీ నుంచి స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది. ఒకటి లేదా ఎక్కువ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది.
ఎంటర్‌టైన్మెంట్ వీసా: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సెక్టార్ లోని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వీసా ఇది. విశ్రాంతి లేదా ప్రదర్శన నిమిత్తం వచ్చే ప్రముఖులకు దీన్ని కేటాయిస్తారు.
ఈవెంట్ వీసా: పండుగలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులకు హాజరయ్యేవారికి ఈ ఈవెంట్ వీసాలు జారీ చేస్తారు. అయితే వీటిని ఈవెంట్ నిర్వాహకులచే స్పాన్సర్ చేయాలి.
క్రూయిజ్ టూరిజం వీసా: క్రూయిజ్ ట్రావెలర్లకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇది. లైసెన్స్ పొందిన మారిటైమ్ సంస్థల ద్వారా స్పాన్సర్ చేస్తారు.
రెసిడెన్సీ, ఇతర వీసా అప్‌డేట్‌లు
హ్యుమానిటేరియన్ రెసిడెన్స్ పర్మిట్: సంక్షోభ పరిస్థితుల నుంచి వచ్చే వ్యక్తులకు ఒక సంవత్సరం పునరుద్ధరించతగిన వీసా.
స్నేహితులు, బంధువుల కోసం విజిట్ వీసా: నివాసితులు తమ బంధువులకు దీన్ని స్పాన్సర్ చేయవచ్చు.
ట్రక్ డ్రైవర్ వీసా: లాజిస్టిక్స్ లో కార్మిక కొరతను పరిష్కరించే వీసా. లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది.
వితంతువులు, విడాకులకు రెసిడెన్సీ: నిర్వచించిన పరిస్థితులలో ఒక సంవత్సరం పునరుద్ధరణ అనుమతి.
బిజినెస్ ఎక్స్ ప్లోరేషన్ వీసా: బిజినెస్ ప్రారంభించేందుకు వచ్చే ఆర్థిక సాల్వెన్సీ రుజువు ఉన్న వ్యాపారవేత్తలకు జారీ చేస్తారు.