ఆర్థిక ఇబ్బందులతో దేశీ స్టార్టప్‌ కంపెనీలు సతమతం

Thousands of Techies Lose Jobs in Indian Startups: Survey - Sakshi

పొదుపు చర్యల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన

షేర్‌ మార్కెట్ల పతనం, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల వల్లే: నిపుణులు

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ఇందుకు కారణమైందని వెల్లడి

(కంచర్ల యాదగిరిరెడ్డి)
దేశంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న కొత్త మంత్రం స్టార్టప్‌.. స్టార్టప్‌.. వినూత్నమైన ఉత్పత్తులు, సేవలతో సరికొత్త వ్యాపారాలను సృష్టించి భారత యువత ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రూ. వందల వేల కోట్ల విలువైన పెట్టుబడులు స్టార్టప్‌ కంపెనీల్లోకి ప్రవహిస్తూ ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ప్రతి వ్యవస్థలో ఒడిదుడుకులు ఉన్నట్లే ప్రస్తుత మన స్టార్టప్‌ కంపెనీలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు...
దేశంలో ఇప్పటివరకు దాదాపు 72 వేల స్టార్టప్‌లు ఏర్పాట య్యాయి. ఈ ఏడాది జూన్‌ వరకూ భారత స్టార్టప్‌ కంపెనీలు ఆకర్షించిన పెట్టుబడులు సుమారు రూ. 1.36 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. కేవలం 891 ఒప్పందాల ద్వారా ఈ స్థాయి పెట్టుబడులు రావడమన్నది చెప్పుకోదగ్గ విషయమే. ఈ సమయంలోనే సుమారు 18 స్టార్టప్‌ కంపెనీలు 100 కోట్ల డాలర్ల విలువైనవిగా (యూనికార్న్‌)గా మారిపోయాయి. గతేడాదితో పోలిస్తే వచ్చిన పెట్టుబడులు, యూనికార్న్‌లుగా ఎదిగిన కంపెనీల సంఖ్య రెండూ ఎక్కువే.

సరిపెట్టుకుంటున్న స్టార్టప్‌లు..
పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో భారత స్టార్టప్‌ కంపెనీలు కూడా అందుకు తగ్గట్లుగా సర్దుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మార్కెటింగ్‌ వ్యవహారాలను తగ్గించుకోవడం ద్వారా పొదుపును పాటించే ప్రయత్నం చేస్తున్నాయి. భారం తగ్గించుకొనే క్రమంలో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 వేలకు పైనే. ఈ పరిస్థితి ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా. కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులు ఉనికిలోకి రాగా విద్యకు సంబంధించిన స్టార్టప్‌లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. వీడియో గేమింగ్‌ పరిస్థితి కూడా ఇదే.

అయితే కోవిడ్‌ సద్దుమణుగుతున్న నేపథ్యంలో ఈ రంగాలకు నిధుల కొరత ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చాలా రంగాల్లోని స్టార్టప్‌లు గత రెండేళ్లుగా నిధులు సేకరించలేదు. ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి కంపెనీలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే సమీప భవిష్యత్తులో మళ్లీ స్టార్టప్‌లు నిలదొక్కుకోగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడితే నిధులు వస్తాయని, కాకపోతే వచ్చే ఈ నిధులను కొంచెం ఆచితూచి తగిన వ్యాపార ప్రణాళికతో ఖర్చు చేస్తే మేలన్నది వారి అభిప్రాయం.


మే నెలలో మందగమనం..

ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో పెట్టుబడుల మొత్తం రూ. 1.36 లక్షల కోట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఫలితంగా ఏప్రిల్‌ నుంచే మందగమనం మొదలైంది. మే నెలలో వచ్చిన పెట్టుబడులు రూ. 14 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ గతంలో కుది రిన ఒప్పందాల కారణంగా వచ్చినవే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా షేర్‌ మార్కెట్ల పతనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, సరుకు రవాణా ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి భారత స్టార్టప్‌ వ్యవస్థపైనా ప్రభావం చూపాయని నిపుణులు విశ్లేస్తున్నారు.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కూడా ఇందు కు ఒక కారణంగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వెంచర్‌ క్యాపిటలిస్టులైన సాఫ్ట్‌ బ్యాంక్, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌ మెంట్‌లు మే నెలలోనే 2022 సంవత్సరానికిగాను నష్టాలను ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకూ ప్రతి త్రైమాసి కానికి 1,000–1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగా మే–జూన్‌ త్రైమాసికంలో అది 40% దాకా తగ్గిపోయి 600–700 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ( పాపం.. ఓలా అంచనా తల్లకిందులైందే!)

నిపుణుల మాట ఇదీ..
ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కగలిగినవి మాత్రమే భవిష్యత్తులో దేశంలోని దిగ్గజ కంపెనీల జాబితాలోకి చేరిపోతాయి. 2021ని స్టార్టప్‌లకు ఊపిరి పోసిన ఏడాదిగా చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కగలిగితే వాటి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. 
– ఆశిష్‌ శర్మ, ఇన్నోవెన్‌ క్యాపిటల్‌ ఇండియా మేనేజింగ్‌ పార్ట్‌నర్‌

భారత స్టార్టప్‌ వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టెక్నాలజీ, ఇన్నొవేషన్, ఉత్పత్తులన్నీ యథాతథంగా కొనసాగుతాయనేది నా నమ్మకం. కంపెనీల వ్యాల్యుయేషన్‌లో తగ్గుదల ఉన్నా మొత్తమ్మీద పరిస్థితి బాగుంది.
– సి.విజయ్‌ కుమార్, సీఈవో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

గత 2 నెలల్లో స్టార్టప్‌ వ్యవస్థకు సమస్యల ముసురు పట్టుకుంది. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉన్న కంపె నీల వ్యాపార ప్రణాళికలు వెనుకంజ వేస్తుండగా కొత్త వాటికి నిధులు గగనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? సమస్యలు ఇలాగే ఉంటే వాటి భవిష్యత్తు ఏమవుతుంది? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలి.
– కేశవ్‌ ఆర్‌. మురుగేష్, నాస్కామ్‌ మాజీ చైర్మన్‌

స్టార్టప్‌ కంపెనీలు మౌలికాంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వెంచర్‌ క్యాపిటలిస్టులు లేదా పెట్టు బడిదారులు గతంలో మాదిరిగా సులువుగా పెట్టుబ డులు పెట్టడం లేదు. ఉత్పత్తి లేదా సేవ ఆదాయాన్ని ఇవ్వగలదా లేదా? అన్నది చూస్తున్నారు. ఇప్పటివరకూ చాలా వరకూ స్టార్టప్‌లు తమ ఉత్పత్తులు/సేవలను రాయితీ ధరలతో అమ్మే ప్రయత్నం చేశాయి. ఇలా కాకుండా వాస్తవ అవసరాలను గుర్తించి చేసే వ్యాపారం లాభదాయకమా కాదా? అని ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిది.
– మురళి బుక్కపట్నం, టై గ్లోబల్‌ ఉపాధ్యక్షుడు

స్టార్టప్‌లకు అకస్మాత్తుగా నిధులు మందగించడం ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో భాగమే. దీనిపై ఆందోళన అవ సరం లేదు. అయితే కేవలం వ్యాల్యుయేషన్‌పైనే ఆధార పడి కొంతకాలంగా స్టార్టప్‌ కంపెనీలు పనిచేస్తుండటం ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చు. ఆదాయాన్ని సృష్టించగలమా? లాభాలు వస్తాయా అనే ఆలోచన లేకుండా కంపెనీలు పెట్టుబడిదారుల నుంచి వస్తున్న నిధులను ఖర్చు చేయడమే ఆందోళన కలిగించే విషయం.
– ఇటీవలి నివేదికలో ఆర్‌బీఐ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top