ఫ్యూచర్‌కు షాక్‌! లీగల్‌ నోటీసులు పంపిన రిలయన్స్‌!

Termination Notice To 947 Future Group Stores From Reliance - Sakshi

న్యూఢిల్లీ: దేశీ రిటైల్‌ మార్కెట్‌పై ఆధిపత్యం కోసం దిగ్గజ కంపెనీల మధ్య సాగుతున్న పోరు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. తాజాగా ఫ్యూచర్‌ రిటైల్‌కు చెందిన 950 స్టోర్స్‌కి సంబంధించిన సబ్‌–లీజును రద్దు చేయాలని రిలయన్స్‌ రిటైల్‌ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఫ్యూచర్‌ రిటైల్‌కు నోటీసులు జారీ చేసింది. రుణభారంతో కుంగుతున్న ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థలు గురువారం ఈ వివరాలను స్టాక్‌ ఎక్ఛేంజీలకు తెలియజేశాయి.

వీటిలో 835 ఫ్యూచర్‌ రిటైల్‌ స్టోర్స్‌ ఉండగా, 112 ఫ్యూచర్‌ లైఫ్‌స్టయిల్‌ స్టోర్స్‌ ఉన్నాయని వివరించింది. ‘రిలయన్స్‌ సంస్థల నుంచి సబ్‌–లీజుకు తీసుకున్న ప్రాపర్టీలకు సంబంధించి రద్దు నోటీసులు అందాయి. వీటిలో 342 భారీ ఫార్మాట్‌ స్టోర్స్‌ (బిగ్‌ బజార్, ఫ్యాషన్‌ఎట్‌బిగ్‌బజార్‌ మొదలైనవి), 493 చిన్న ఫార్మాట్‌ స్టోర్స్‌ (ఈజీడే, హెరిటేజ్‌ స్టోర్స్‌ వంటివి) ఉన్నాయి‘ అని ఫ్యూచర్‌ రిటైల్‌ పేర్కొంది.

మరోవైపు, 34 ’సెంట్రల్‌’ స్టోర్లు, 78 ’బ్రాండ్‌ ఫ్యాక్టరీ’ అవుట్‌లెట్ల సబ్‌–లీజు రద్దు నోటీసులు తమకు వచ్చినట్లు ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ వివరించింది. కంపెనీ రిటైల్‌ ఆదాయాల్లో వీటి వాటా దాదాపు 55–65 శాతం వరకూ ఉంటుందని పేర్కొంది. యథాతథ స్థితిని కొనసాగించేందుకు, వివిధ వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రిలయన్స్‌ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌లోని రెండు సంస్థలూ తెలిపాయి.  

గత నెలలోనే టేకోవర్‌.. 
ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఫ్యూచర్‌ గ్రూప్‌ తన రిటైల్‌ వ్యాపార కార్యకలాపాలను .. రూ. 24,713 కోట్ల మొత్తానికి రిలయన్స్‌కు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్‌ కూపన్స్‌ సంస్థలో స్వల్ప వాటాల వల్ల, పరోక్షంగా రిటైల్‌ విభాగాల్లోను వాటాదారుగా మారిన ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఈ డీల్‌ను అడ్డుకుంటోంది. దీనిపై ప్రస్తుతం అమెజాన్, ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య న్యాయ వివాదం నడుస్తోంది. 

ఇక, ఫ్యూచర్‌ గ్రూప్‌నకు 1,700 పైచిలుకు అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా లీజు అద్దెలను కొన్నాళ్లుగా ఫ్యూచర్‌ గ్రూప్‌ చెల్లించలేకపోతోంది. ఇవన్నీ మూతబడే పరిస్థితి నెలకొనడంతో వీటిలో కొన్ని స్టోర్స్‌ లీజును రిలయన్స్‌ తన అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)కు బదలాయించుకుని, వాటిని ఫ్యూచర్‌కు సబ్‌–లీజుకు ఇచ్చినట్లు సమాచారం. 

ప్రస్తుత సరఫరాదారులకు సైతం ఫ్యూచర్‌ చెల్లింపులు జరపలేకపోతుండటంతో ఆయా స్టోర్స్‌కు అవసరమైన ఉత్పత్తులను కూడా రిలయన్స్‌ జియోమార్ట్‌ సరఫరా చేస్తోంది. దీంతో సదరు స్టోర్స్‌లో అధిక భాగం ఉత్పత్తులు రిలయన్స్‌వే ఉన్నాయి. సబ్‌–లీజు బాకీలను ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థలు కట్టలేకపోవడం వల్ల రిలయన్స్‌ ఆ అవుట్‌లెట్స్‌ను స్వాధీనం చేసుకుని, రీబ్రాండింగ్‌ చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగానే సబ్‌–లీజులను రద్దు చేసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top