టెలికం రంగంలో సంస్కరణలు తేవాలి

Telecoms Seek Exemption From OECD Tax Reforms - Sakshi

పన్నులు తగ్గించాలి

స్పెక్ట్రం చెల్లింపులకు మరింత మారటోరియం ఇవ్వాలి

కేంద్రానికి సీవోఏఐ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రానికి టెల్కోలు విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే సుంకాలు తగ్గించాలని, వేలం వేసిన స్పెక్ట్రం హోల్డింగ్‌ కాలావధిని రెట్టింపు చేయాలని, స్పెక్ట్రం చెల్లింపులపై 7–10 ఏళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని కోరాయి. టెల్కోల సమాఖ్య సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) ఈ మేరకు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌కు లేఖ రాసింది. అత్యధిక పన్నుల భారం పడే రంగాల్లో టెలికం పరిశ్రమ కూడా ఒకటని అందులో పేర్కొంది.

ఆదాయాల్లో 32 శాతం భాగం పన్నులు, సుంకాల రూపంలో కట్టాల్సిన ప్రస్తుత విధానంతో కంపెనీలు మనుగడ సాగించడం కష్టంగా మారిందని వివరించింది. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల దగ్గర నిరంతరం మిగులు నిధులు ఉండే పరిస్థితి లేనందున ఇంతటి భారీ స్థాయి పన్నులనేవి పరిశ్రమ వృద్ధికి ప్రతికూలమని సీవోఏఐ  తెలిపింది. వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో తదితర సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. లేఖ కాపీలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా సీవోఏఐ పంపింది.

పలు ప్రతిపాదనలు..
టెలికం రంగాన్ని తిరిగి పటిష్టమైన, నిలకడైన వృద్ధి బాట పట్టించడానికి ప్రాథమిక ఆర్థిక సంస్కరణలు అత్యవసరమని సీవోఏఐ పేర్కొంది. ఇందులో భాగంగా తీసుకోతగిన విధానపరమైన చర్యలకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. పన్నులు, సుంకాలు తగ్గించడం, స్పెక్ట్రంనకు సంబంధించి ధరను సహేతుకంగా నిర్ణయించడం, చెల్లింపులకు సులభతరమైన నిబంధనలు విధించడం, హోల్డింగ్‌ వ్యవధిని పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే, సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌) నిర్వచనాన్ని పునఃసమీక్షించడం, కనీస ధరను నిర్ణయించడం, ఆర్థిక..పనితీరుపరమైన బ్యాంక్‌ గ్యారంటీల నుంచి మినహాయింపునివ్వడం వంటి ఇతర ప్రతిపాదనలు ఉన్నాయి.

రుణాలు, నష్టాల భారంతో వొడాఫోన్‌ ఐడియా అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో సీవోఏఐ ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్‌ ఐడియాను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అది గానీ మూతబడితే పరిశ్రమలో రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆఖరు నాటికి వొడాఫోన్‌ ఐడియా మొత్తం రుణభారం రూ. 1,91,590 కోట్లుగా ఉంది. ఇందులో స్పెక్ట్రం చెల్లింపు బకాయి రూ. 1,06,010 కోట్లు, ఏజీఆర్‌ బాకీ రూ. 62,180 కోట్లుగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top