
ఎగుమతిదారులు టారిఫ్‌లు, ద్రవ్యోల్బణం, డిమాండ్ అనిశ్చితిలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్థికంగా వెసులుబాటు లభించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్‌కి ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో విజ్ఞప్తి చేసింది. రుణాలకు సంబంధించి అసలు, వడ్డీపై ఒక ఏడాది పాటు వన్–టైమ్ మారటోరియం(రుణాలు చెల్లించేందుకు గడువు పొడిగింపు) ప్రకటించాలని కోరింది. అలాగే ప్రాధాన్యతా రంగం కింద వర్గీకరించినప్పటికీ ఎగుమతి సంస్థలకు తగు స్థాయిలో ప్రయోజనం లభించడం లేదని పేర్కొంది.
ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన 40 శాతం రుణాలకు సంబంధించి ఎగుమతిదార్ల వాటా 2–2.5 శాతంగా ఉండేలా ఆదేశించాలని ప్రతిపాదించింది. గురువారం ఆర్‌బీఐతో సమావేశమైన సందర్భంగా ఎఫ్‌ఐఈవో ఈ మేరకు విజ్ఞప్తులు చేసింది. బ్యాంకులు సరళతరమైన విధంగా రుణాలు అందించాలని, పరిస్థితిని బట్టి పునర్‌వ్యవస్థీకరించాలని, అంతర్జాతీయంగా లావాదేవీల నిర్వహణ విషయంలో ఎగుమతిదార్లకు మద్దతుగా నిలవాలని కోరింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల కారణంగా కొనుగోళ్లు, ఉత్పత్తి, ఎగుమతి షెడ్యూల్స్‌లో జాప్యం జరుగుతోందని పేర్కొంది. కాబట్టి, ఎగుమతి చేయడానికి ముందు ఇచ్చే స్వల్పకాలిక రుణాల కాలవ్యవధిని పెంచితే ఎగుమతిదార్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎఫ్‌ఐఈవో తెలిపింది.
తమ పరిధిలో లేని జాప్యాల వల్ల ఆర్థికంగా దెబ్బ తినకుండా నిర్వహణ మూలధనాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు, కాంట్రాక్టు నిబంధనలను పాటించేందుకు వీలవుతుందని వివరించింది. ఇలాంటి ఊరటనిచ్చే చర్యలతో ఎగుమతిదార్లు, మార్కెట్లలో నెలకొన్న కొత్త పరిస్థితులకు అనుగుణంగా తమ కార్యకలాపాలను, వ్యూహాలను మార్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్) తరహా పథకాన్నిమళ్లీ ప్రవేశపెట్టాలని ఎఫ్‌ఐఈవో విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రస్తుతం ఇలాంటివి చాలా అవసరమని వివరించింది.
ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి