117 కోట్లకు టెలికం చందాదారులు | Sakshi
Sakshi News home page

117 కోట్లకు టెలికం చందాదారులు

Published Fri, Feb 17 2023 5:19 AM

Telecom Subscriber Base Declines To 117 Crores In India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో టెలికం చందారుల సంఖ్య గతేడాది ముగింపునకు 117 కోట్లు దాటింది. కొత్త చందాదారులను ఆకర్షించడంలో ఎప్పటి మాదిరే 2022 డిసెంబర్‌ నెలలోనూ రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ మంచి పనితీరును చూపించాయి. రిలయన్స్‌ జియో 17 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించగా, భారతీ ఎయిర్‌టెల్‌ 15.2 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్టు ట్రాయ్‌ నివేదిక వెల్లడించింది.

ఇక మరో ప్రైవేటు టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐ) 24.7 లక్షల కస్టమర్లను డిసెంబర్‌ నెలలో నష్టపోయింది. మొబైల్‌ చందాదారుల సంఖ్య 2022 నవంబర్‌ నాటికి 1,143.04 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్‌ చివరికి 1,142.93 మిలియన్లకు తగ్గింది. వైర్‌లైన్‌ సబ్‌్రస్కయిబర్లు డిసెంబర్‌ చివరికి 2.74 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్‌ విభాగంలో రిలయన్స్‌ జియో 2,92,411 మంది కొత్త కస్టమర్లు సంపాదించింది. భారతీ ఎయిర్‌టెల్‌ 1,46,643 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ప్రభుత్వరంగ ఎంటీఎన్‌ఎల్‌ 1.10 లక్షల మంది వైర్‌లైన్‌ సబ్ర్‌స్కయిబర్లను కోల్పోయింది.  

టెలికం సేవల్లో ఇప్పటికీ సమస్యలే..  లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి 
దేశంలో టెలికం వినియోగదారులు నేటికీ సేవలు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాల్స్‌డ్రాప్, కాల్‌ కనెక్టింగ్‌ సమస్యలు వారిని వేధిస్తున్నాయి. లోకల్‌సర్కిల్స్‌ ఇందుకు సంబంధించి చేసిన ఆన్‌లైన్‌ సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. 28 శాతం మంది కస్టమర్లు తాము ఎలాంటి అవాంతరాల్లేని 4జీ, 5జీ సేవలు ఆనందిస్తున్నట్టు చెప్పగా.. 32 శాతం మంది తాము డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ అన్ని వేళల్లోనూ అంతరాయాల్లేని సేవలను పొందలేకపోతున్నట్టు తెలిపారు.

69 శాతం మంది తాము కాల్‌ కనెక్షన్‌/కాల్‌ డ్రాప్‌ సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 42,000 మంది నుంచి ఈ అభిప్రాయాలను లోకల్‌సర్కిల్స్‌ తెలుసుకుంది. కాల్‌ కనెక్షన్, కాల్‌ డ్రాప్‌పై సంధించిన ప్రశ్నకు 10,927 మంది స్పందించారు. వీరిలో 26 శాతం మంది తాము నివసించే ప్రాంతంలో ఎయిర్‌టెల్, జియో, వొడాఐడియా సేవలు మంచి కవరేజీతో ఉన్నట్టు చెప్పగా.. 51 శాతం మంది కవరేజీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు.

Advertisement
Advertisement