
కొత్త సెంటర్ల ఏర్పాటుకు ఆకర్షణీయ గమ్యస్థానం
ప్రస్తుతం 360 పైగా జీసీసీలు, వాటిలో 3.1 లక్షల మంది సిబ్బంది
ఎక్స్‌ఫినో నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు తెలంగాణ కీలక గమ్యస్థానంగా మారినట్లు స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫినో ఒక నివేదికలో తెలిపింది. గత మూడేళ్లుగా భారత్‌లో ఏర్పాటైన 40 శాతం సెంటర్లను హైదరాబాద్ ఆకర్షించినట్లు వివరించింది. ఇదే వ్యవధిలో బెంగళూరు వాటా 33 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
కేపబిలిటీ సెంటర్లకు సంబంధించి దేశ, విదేశాల్లో తెలంగాణకి పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోందని రిపోర్ట్ తెలిపింది.టాలెంట్ లభ్యత, మౌలిక వసతులు, పాలసీలు మొదలైనవి రాష్ట్రానికి సానుకూలంగా ఉంటున్నాయని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 360 జీసీలు ఉన్నట్లు వివరించింది. వీటిలో సుమారు 3.1 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉన్నారని, రాష్ట్ర వైట్–కాలర్ సిబ్బందిలో ఇది 14 శాతమని రిపోర్ట్ తెలిపింది.
‘‘భారత్‌లో కొత్తతరం జీసీసీ పవర్‌హౌస్‌గా తెలంగాణ వేగంగా ఎదుగుతోంది. నిపుణులైన సిబ్బంది లభ్యత, మెరుగైన మౌలిక సదుపాయాలతో గ్లోబల్ దిగ్గజాలను ఆకర్షిస్తోంది’’ అని ఎక్స్‌ఫినో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ తెలిపారు. వ్యయాల విషయంలో ఇతర నగరాలకు దీటుగా పోటీనిస్తూ, టెక్నాలజీ, టెక్‌యేతర కార్యకలాపాలకు కీలకమైన హబ్‌గా తెలంగాణ నిలుస్తోందని సంస్థ సీఈవోగా కొత్తగా ఎంపికైన పి. ఫ్రాన్సిస్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెడుతున్న కొత్త తరం జీసీసీలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంటోందని పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం..
→ తెలంగాణలో 47.8 లక్షల మంది వైట్–కాలర్ ప్రొఫెషనల్స్ అందుబాటులో ఉన్నారు. వీరిలో 23.3 లక్షల మందికి ఏడాది పైగా అనుభవం ఉంది.
→ జీసీసీ సిబ్బందిలో 33 శాతం మంది మహిళలు ఉన్నారు. నాయకత్వ స్థానాల్లో 19 శాతం మంది ఉన్నారు.
→ రాష్ట్రంలోని మొత్తం జీసీసీ ఉద్యోగాల్లో ఇంజినీరింగ్, ఐటీ వాటా 57 శాతంగా ఉంది.