దుమ్మురేపిన టీసీఎస్‌...! తొలిసారి రికార్డు స్థాయిలో..!

Tcs Q4 Results Announced on Monday - Sakshi

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల టాప్‌ ర్యాంకు దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మరోసారి ఆర్థిక ఫలితాలలో యస్‌ అనిపించింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో తొలిసారి ఆదాయం రూ. 50,000 కోట్ల మైలురాయిని దాటింది. వెరసి క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15.8 శాతం జంప్‌చేసి రూ. 50,591 కోట్లకు చేరింది. ఇక నికర లాభం 7.4 శాతం వార్షిక వృద్ధితో రూ. 9,926 కోట్లను తాకింది. అయితే మార్జిన్లు 1.8 శాతం నీరసించి 25.3 శాతానికి పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. లేదంటే ఒక త్రైమాసికంలో నికర లాభం రూ. 10,000 కోట్ల మార్క్‌ను అందుకునేదని తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది.

25 బిలియన్‌ డాలర్లు
మార్చితో ముగిసిన గతేడాదిలో టీసీఎస్‌ తొలిసారి 25.7 బిలియన్‌ డాలర్ల(రూ. 1,91,754 కోట్లు) టర్నోవర్‌ సాధించింది. ఇది 16.8 శాతం అధికంకాగా.. నికర లాభం 14.8 శాతం ఎగసి రూ. 38,327 కోట్లకు చేరింది. ఆర్డర్‌బుక్‌ విలువ కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు టీసీఎస్‌ వెల్లడించింది. 46 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,92,000కు అధిగమించినట్లు తెలియజేసింది. అయితే ఉద్యోగ వలస(అట్రిషన్‌ రేటు) అత్యధికంగా 17.4 శాతానికి చేరినట్లు తెలియజేసింది. సాఫ్ట్‌వేర్‌ సేవల పరిశ్రమలోనే అత్యధికంగా 25.3 శాతం నిర్వహణ మార్జిన్లను సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. నికరలాభ మార్జిన్లు 19.6 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది.

నాలుగో బైబ్యాక్‌
సవాళ్లను అధిగమిస్తూ మరోసారి పరిశ్రమలోనే చెప్పుకోదగ్గ నిర్వహణ లాభాలు ఆర్జించినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్‌ శేక్సారియా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నాలుగోసారి ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. క్యూ4లో రిటైల్, సీపీజీ విభాగం 22.1 శాతం, తయారీ 19 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 18.7 శాతం, టెక్నాలజీ సర్వీసులు 18 శాతం, లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌కేర్‌ 16.4 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 12.9 శాతం చొప్పున వృద్ధి సాధించినట్లు వివరించారు. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా 18.7 శాతం, ఇంగ్లండ్‌ 13 శాతం, కాంటినెంటల్‌ యూరోప్‌ 10 శాతం, లాటిన్‌ అమెరికా 20.6 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 7.3 శాతం, భారత్‌ 7 శాతం, ఆసియా పసిఫిక్‌ 5.5 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేశారు.  

ఇతర హైలైట్స్‌
► క్యూ4లో జత కలసిన 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన 10 కొత్త క్లయింట్లు.  
► 5 కోట్ల డాలర్లకుపైగా విలువైన 19 కస్టమర్లు కంపెనీ చెంతకు.
► 2 కోట్ల డాలర్ల క్లయింట్లు 40, కోటి డాలర్ల కస్టమర్లు 52 చేరిక.
► క్యూ4లో నికరంగా 35,209 మందికి ఉపాధి.  
► ఏడాదిలో నికరంగా 1,03,546 మందికి ఉద్యోగాలు. ప్రైవేట్‌ రంగంలో రికార్డ్‌.
► మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,92,195కాగా.. 35.6 శాతం మంది మహిళలే.  
► కంపెనీ ఫ్రీ క్యాష్‌ ఫ్లో రూ. 39,181 కోట్లుకాగా.. రూ. 31,424 కోట్లను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల ద్వారా వాటాదారులకు చెల్లించింది.
► ఈ ఏడాది(2022–23)లో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పిస్తామన్న సీవోవో ఎన్‌జీ సుబ్రమణ్యం. గతేడాది సైతం ఇదే స్థాయిలో లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ లక్ష మందికిపైగా ఉద్యోగాలిచ్చినట్లు తెలియజేశారు.

రికార్డ్‌ ఆర్డర్లు
క్యూ4లో అత్యధికంగా 3.533 బిలియన్‌ డాలర్ల ఇంక్రిమెంటల్‌ రెవెన్యూ అదనంగా జత కలసింది. 11.3 బిలియన్‌ డాలర్లతో ఆల్‌టైమ్‌ గరిష్టానికి ఆర్డర్‌బుక్‌ చేరింది. పూర్తి ఏడాదికి 34.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లను కలిగి ఉన్నాం. కస్టమర్ల వృద్ధికి, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సహకరించడం ద్వారా 15 శాతం వృద్ధితో గతేడాదిని పటిష్టంగా ముగించాం. కంపెనీ చరిత్రలోనే రికార్డు ఆర్డర్‌ బుక్‌ను సాధించడంతో భవిష్యత్‌లోనూ పురోగతి బాటలో కొనసాగనున్నాం. కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు వెచ్చిస్తున్నాం.              
– రాజేష్‌ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్‌.  

కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.4 శాతం బలపడి రూ. 3,699 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,712–3,656 మధ్య ఊగిసలాడింది.

చదవండి: వారానికి నాలుగు రోజుల పని...! చేసేందుకు సిద్దమంటోన్న ఉద్యోగులు..! కంపెనీల నిర్ణయం ఇలా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top