టీసీఎస్‌ క్యూ3 భేష్‌!

Tcs Q3 Results Highlights: India's Largest It Services Firms Net Profit Rises To Rs 10,846 Crore - Sakshi

నికర లాభం రూ. 10,846 కోట్లు

మొత్తం ఆదాయం రూ. 58,229 కోట్లు

వచ్చే ఏడాది 1.5 లక్షల మందికి ఉపాధి

షేరుకి రూ. 75 చొప్పున డివిడెండ్‌

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 11 శాతం పుంజుకుని రూ. 10,846 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,769 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 19 శాతం ఎగసి రూ. 58,229 కోట్లకు చేరింది.

గత క్యూ3లో రూ. 48,885 కోట్ల టర్నోవర్‌ నమోదైంది. కార్యకలాపాల్లో వృద్ధి, ఫారెక్స్‌ లాభాలు తాజా త్రైమాసికంలో కంపెనీ లాభదాయకతకు సహకరించాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 75 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. దీనిలో రూ. 67 ప్రత్యేక డివిడెండ్‌ కలసి ఉంది. వెరసి డివిడెండ్‌ రూపేణా రూ. 33,000 కోట్లను పంచనుంది. డాలర్ల రూపేణా ఆదాయం 8 శాతం మెరుగుపడినట్లు టీసీఎస్‌ పేర్కొంది. 

భారీగా ఉద్యోగాలు 
వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో అత్యంత భారీగా ఉద్యోగ సృష్టికి తెరతీయనున్నట్లు టీసీఎస్‌ వెల్లడించింది. సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. డీల్‌ పరిస్థితులు, పైప్‌లైన్‌ ఆశావహంగా ఉన్నట్లు సీవోవో ఎన్‌.గణపతి సుబ్రమణ్యం పేర్కొన్నారు. 7 నుంచి 9 బిలియన్‌ డాలర్ల మధ్య డీల్స్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. వీటికి మధ్యస్థంగా కాంట్రాక్టులు పొందినట్లు వెల్లడించారు. థర్డ్‌పార్టీ, ఇతర వ్యయాలు పెరగడంతో లాభాల మార్జిన్లు ప్రభావితమైనట్లు సీఎఫ్‌వో సమీర్‌ సేక్సరియా పేర్కొన్నారు. గతేడాది స్థాయిలోనే 25 శాతం ఇబిటా మార్జిన్లు సాధించగలమని తెలియజేశారు.  

తగ్గిన సిబ్బంది... 
చాలా ఏళ్ల తదుపరి క్యూ3లో టీసీఎస్‌ మొత్తం సిబ్బంది సంఖ్య 2,197 తగ్గి 6,13,974కు పరిమితమైంది. ఉపాధి కల్పనకు మించి ఉద్యోగ వలస దీనికి కారణమైనట్లు హెచ్‌ఆర్‌ చీఫ్‌ మిలింద్‌ లక్కడ్‌ తెలియజేశారు. ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో 42,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోగా.. క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరికొంతమందికి ఆఫర్‌ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వచ్చే ఏడాది(2023–24)లోనూ 40,000 మంది కొత్తవారిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. పూర్తి ఏడాదిలో 1.25–1.5 లక్షల మందిని ఎంపిక చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు.  

ఇతర హైలైట్స్‌ 
► నిర్వహణ లాభ మార్జిన్లు 0.5 శాతం బలపడి 24.5 శాతాన్ని తాకాయి. 
► క్యూ3లో 7.9 బిలియన్‌ డాలర్ల విలువైన డీల్స్‌ కుదుర్చుకుంది. 
► ఉద్యోగుల వలస(అట్రిషన్‌) స్వల్పంగా తగ్గి 21.3 శాతానికి చేరింది. 
► కొత్త ఏడాదిలో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటన.
మార్కెట్లు ముగిశాక టీసీఎస్‌ సాయంత్రం ఫలితాలు విడుదల చేసింది. క్యూ3 పనితీరుపై అంచనాలతో టీసీఎస్‌ షేరు బీఎస్‌ఈలో 3.35 శాతం ఎగసి రూ. 3,320 వద్ద ముగిసింది.

చదవండి: ‘70 ఉద్యోగాలకు అప్లయ్‌ చేశా.. ఒక్క జాబ్‌ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top