
ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 25 శాతం ఎగసి రూ. 1,306 కోట్లను అధిగమించింది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక బిజినెస్‌ల పటిష్ట పనితీరు ఇందుకు తోడ్పాటునిచ్చాయి.
అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 1,046 కోట్ల లాభం మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 16,464 కోట్ల నుంచి రూ. 17,447 కోట్లకు బలపడింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. జులై 7న చెల్లించనుంది.
కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 4,280 కోట్ల నుంచి రూ. 4,775 కోట్లకు పుంజుకుంది. మొత్తం ఆదాయం రూ. 63,272 కోట్ల నుంచి రూ. 66,992 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 2 శాతం లాభంతో రూ. 397 వద్ద ముగిసింది.
టాటా క్యాపిటల్ లాభం హైజంప్
త్వరలో ఐపీవోకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న టాటా క్యాపిటల్ మార్చి త్రైమాసికానికి రూ.1,000 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.765 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం ఇదే కాలంలో 50 శాతం వృద్ధితో రూ.7,478 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,998 కోట్లుగా ఉంది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్ లాభం రూ.3,665 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2023–24) లాభం రూ.3,327 కోట్లతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ఆదాయం రూ.18,715 కోట్ల నుంచి రూ.28,313 కోట్లకు చేరుకుంది. గత నెలలో టాటా క్యాపిటల్ సెబీ వద్ద ఐపీవో పత్రాలను దాఖలు చేయడం తెలిసిందే.
2 బిలియన్ డాలర్ల నిధులను (రూ.17వేల కోట్లు) సమీకరించాలనుకుంటోంది. సెబీ ఆమోదం లభిస్తే అతిపెద్ద ఐపీవోల్లో ఒకటి కానుంది. టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 92.83 శాతం వాటా ఉంది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్‌బీఐ నుంచి టాటా క్యాపిటల్ గుర్తింపు కలిగి ఉంది.