Sakshi News home page

టాటా గ్రూప్‌ కంపెనీకి కళ్లు చెదిరే లాభాలు

Published Thu, Feb 8 2024 8:44 AM

Tata owned Trent Q3 profit jumps more than two fold on festive demand - Sakshi

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ రిటైల్‌ సంస్థ ట్రెంట్‌ డిసెంబర్‌ క్వార్టర్‌కు కళ్లు చెదిరే లాభాలు ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.155 కోట్ల నుంచి రూ.371 కోట్లకు దూసుకుపోయింది. 140 శాతం వృద్ధి చెందింది. వెస్ట్‌సైడ్, జుడియో, స్టార్‌ పేరుతో రిటైల్‌ స్టోర్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. 

ఆదాయం 50 శాతం వృద్ధితో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,303 కోట్ల నుంచి రూ.3,467 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 42 శాతం పెరిగి రూ.3,101 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని ఫార్మాట్‌లలోనూ స్థిరమైన వృద్ధిని కొనసాగించాం. నిర్వహణ క్రమశిక్షణ, వేగవంతమైన నిర్వహణ మా విస్తరణ అజెండాకు మద్దతుగా నిలిచాయి’’అని సంస్థ తెలిపింది. 

వెస్ట్‌సైడ్, జుడియో స్థూల మార్జిన్‌ గతంలో మాదిరే స్థిరంగా కొనసాగింది. ఆపరేటింగ్‌ ఎబిట్‌ మార్జిన్‌ 13 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 8.5 శాతంగానే ఉంది. బలమైన వృద్ధి విస్తరణ దిశగా తమకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. వెస్ట్‌సైడ్‌ డాట్‌ కామ్, ఇతర టాటా గ్రూప్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకాల్లో 5 శాతం వాటా ఆదాయం లభించినట్టు తెలిపింది. 

డిసెంబర్‌ క్వార్టర్‌లో కొత్తగా 5 వెస్ట్‌సైడ్‌ స్టోర్లు, 50 జుడియో స్టోర్లను ప్రారంభించింది. దీంతో నిర్వహణలోని వెస్ట్‌సైడ్‌ స్టోర్ల సంఖ్య 227కు, జుడియో స్టోర్లు 460కు చేరాయి. స్టార్‌ పేరుతో (గ్రోసరీ) నిర్వహించే స్టోర్ల సంఖ్య 67కు పెరిగింది. భవిష్యత్తులోనూ స్టోర్ల విస్తరణ ద్వారా మరింత మందికి చేరువ అవుతామని సంస్థ చైర్మన్‌ నోయల్‌ టాటా ప్రకటించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ట్రెంట్‌ షేరు 19 శాతం లాభపడి 3,609 వద్ద క్లోజ్‌ అయింది.

Advertisement

What’s your opinion

Advertisement