
మీరు రాబోయే కొత్త సంవత్సరం 2022లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక షాకింగ్ న్యూస్. టాటా మోటార్స్, హోండా, రెనాల్ట్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి వాహన ధరలను పెంచాలని చూస్తున్నాయి. ఇప్పటికే కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి, ఆడీ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. జనవరి 2022లో ధరల పెరుగుదల అనేది మోడల్స్ బట్టి ఉంటుందని మారుతి చెప్పగా, మెర్సిడెస్ బెంజ్ పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల కారణంగా ఎంపిక చేసిన మోడల్స్ కార్లపై ధరల పెంపు అనేది 2 శాతం వరకు ఉంటుందని తెలిపింది.
మరోవైపు, ఇన్ పుట్, కార్యాచరణ ఖర్చుల కారణంగా జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే ధరల పెరుగుదల అనేది మొత్తం మోడల్ శ్రేణిలో 3 శాతం వరకు ఉంటుందని ఆడీ తెలిపింది. ఈ ధరల పెంపు విషయంపై టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. "సరుకులు, ముడిపదార్థాలు, ఇతర ఇన్ పుట్ ఖర్చుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఖర్చుల పెరుగుదలను కనీసం పాక్షికంగా తగ్గించడానికి ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది" అని అన్నారు. ఈ సంస్థ దేశీయ మార్కెట్లో పంచ్, నెక్సన్, హారియర్ వంటి మోడల్ కార్లను విక్రయిస్తుంది."కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా ఇన్ పుట్ ఖర్చుపై తీవ్రమైన ప్రభావం ఉంది. ఎంత వరకు ధరల పెంచాలో అనే దానిపై అధ్యయనం చేస్తున్నాము" అని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
(చదవండి: సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!)
సిటీ, అమేజ్ వంటి బ్రాండ్ల తయారీదారు చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టులో వాహన ధరలను పెంచింది. ధరల పెరుగుదలను తాము కూడా పరిశీలిస్తున్నట్లు రెనాల్ట్ పేర్కొంది. ఫ్రెంచ్ కంపెనీ క్విడ్, ట్రైబ్ర్, కిగర్ వంటి మోడల్ కార్లను భారతీయ మార్కెట్లో విక్రయిస్తుంది. గత ఏడాది కాలంలో ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో కంపెనీలు ధరల పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా, ఇటీవలి కాలంలో రవాణా ఖర్చు పెరిగింది, ఇది ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీదారుల(ఓఈఎమ్) మొత్తం వ్యయ నిర్మాణాలను ప్రభావితం చేస్తుంది.
(చదవండి: Ola Electric Car: ఓలా తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేది అప్పుడే!)