ఎఫ్‌టీఏపై బ్రిటన్‌తో చర్చలు ముమ్మరం | Sakshi
Sakshi News home page

ఎఫ్‌టీఏపై బ్రిటన్‌తో చర్చలు ముమ్మరం

Published Thu, Aug 11 2022 1:21 AM

Talks on free trade agreement wit UK moving at faster pace - Sakshi

న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్‌ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కోసం చర్చలు వేగవంతమయినట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌  తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడమే ఈ ఒప్పందం లక్ష్యమని వివరించారు. భారతదేశం ‘రికార్డు‘ సమయంలో యునైడెట్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ)తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిందని, ఇప్పుడు బ్రిటన్‌తోనూ  చర్చలు వేగంగా జరుగుతున్నాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు తమ మధ్య వర్తకం చేసే గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను గణనీయంగా తగ్గిస్తాయి లేదా తొలగిస్తాయి. అంతేకాకుండా, ఒప్పందం చేసుకున్న దేశాలు వస్తువులు, పెట్టుబడులలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలను సులభతరం చేస్తాయి. జనవరిలో భారతదేశం, బ్రిటన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం అధికారికంగా చర్చలు ప్రారంభించాయి. దీపావళి నాటికి చర్చలు ముగించాలని గడువును నిర్దేశించుకున్నాయి.  

భారత్‌కే కొన్ని సవాళ్లు
కెనడా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), ఇజ్రాయెల్‌లతో కూడా భారతదేశం ఇదే విధమైన ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని మంత్రి తెలిపారు.  భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపడానికి అనేక ఇతర దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయని వెల్లడించారు. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ), యురేషియన్‌ ఎకనమిక్‌ యూనియన్‌ (ఈఏఈయూ), యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ) ఈ ఒప్పందాలపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అయితే,  పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే విషయంలో భారత్‌ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్న ఆయన, అనేక దేశాలతో ఏకకాలంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత్‌ వాణిజ్య మంత్రిత్వ శాఖ వద్ద తగినంత వనరులు లేవని వ్యాఖ్యానించడం విశేషం. జీసీసీ.. గల్ఫ్‌ ప్రాంతంలోని ఆరు దేశాల యూనియన్‌. ఈ యూనియన్‌లో  బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలు ఉన్నాయి. ఇక ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్‌ సభ్య దేశాలు.  ఐదు దేశాల ఈఏఈయూలో రష్యా, అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్,  కిర్గిస్తాన్‌ సభ్యులుగా ఉన్నాయి.

వ్యాపార సంఘాల్లో ఐక్యతకు పిలుపు
దేశీయ వ్యాపారుల సంఘాలు ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి సారించాలని, ఐక్యంగా పని చేయాలని గోయెల్‌ ఈ సందర్భంగా కోరారు. విధాన పరమైన క్లిష్ట అంశాలను సరళతరం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 30,000 నియమ, నిబంధనలను సడలించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement