మూడు రూపాయలకు కక్కుర్తి పడితే? | Sakshi
Sakshi News home page

రూ.3లకు కక్కుర్తి పడితే.. చివరకు ఏం జరిగిందంటే?

Published Mon, Jun 20 2022 11:15 AM

Swiggy directed to pay two thousand Rupees to customer for charging extra GST In Hyderabad - Sakshi

ఓవైపు అలసిపోయి ఉన్నాం.. మరోవైపు ఆకలేస్తోంది.. ఇంకే చేస్తాం ఫోన్‌ ఆన్‌ చేసి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తాం. నిమిషాల్లో వేడివేడిగా ఆహారం వచ్చేస్తుంది. ఇట్స్‌ సింపుల్‌ అనుకుంటున్నారేమో? కానీ ఫుడ్‌తో పాటు అడ్డగోలు ట్యాక్సులు కూడా మనకు డెలివరీ అవుతున్నాయ్‌. మన జేబులకు చిల్లులు పెడుతున్నాయ్‌. డిజిటల్‌ వాలెట్లకు కన్నం వేస్తున్నాయ్‌. ఇలాంటే ఘటనకు సంబంధించి అడ్డగోలు ట్యాక్సులపై కన్నెర్ర చేసింది వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థ.

బిర్యానీ ఆర్డర్‌ చేస్తే
నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన మురళీ కుమార్‌ రెడ్డి 2019 సెప్టెంబరు 8న స్విగ్గీ ద్వారా ముషీరాబాద్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌ నుంచి బిర్యానీ ఆర్డర్‌ చేశారు. మెనూలో ఆ బిర్యానీ ధర రూ.200లు ఉండగా.. కూపన్‌ అప్లై చేసిన తర్వాత డిస్కౌంట్‌ ప్రైస్‌తో రూ.140కే వచ్చింది. జీఎస్‌టీ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధరపై పన్ను విధించాలి. కానీ స్విగీ ఎంఆర్‌పీపై పన్ను విధించింది.

ఇదేం పద్దతి
జీఎస్‌టీ నిబంధనల ప్రకారం బిర్యానీ ధర రూ.140 అయినందున జీఎస్‌టీగా రూ.7లు పన్ను విధించాలి. కానీ స్విగ్గీ అలాకాకుండా తనకు ఎంఆర్‌పీ రూ.200లపై జీఎస్‌టీగా రూ.10 విధించి అదనంగా రూ.3 ట్యాక్స్‌ వసూలు చేసిందంటూ వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థను ఆశ్రయించాడు మురళీ కుమార్‌రెడ్డి. వినియోగదారుడిగా తన హక్కులు కాపాడుతూ అధిక జీఎస్‌టీ వసూలుపై స్విగ్గీని ప్రశ్నించాలని అతను కోరాడు.

పరిహారం
అనేక వాదప్రతివాదనలు పూర్తైన తర్వాత జీఎస్‌టీ పన్ను వసూలు విషయంలో స్విగ్గీ తప్పు చేసినట్టుగా వినియోగదారుల సమస్యల పరిష్కార సంస్థ భావించింది. దీంతో బాధితుడికి రూ.2000లు పరిహారంగా చెల్లించాలంటూ ఆదేశించింది. అదే విధంగా కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.1000 కూడా ఇవ్వాలంటూ పేర్కొంది. కాగా ఈ తీర్పుపై తప్పు తమది కాదంటే తమది కాదంటూ ఇటు రెస్టారెంట్‌, స్విగ్గీలు ఎదుటివారిపై నెపం మోపుతున్నాయి.

చదవండి: ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్‌ మినహాయింపు ఇలా

Advertisement
Advertisement